వెన్నముకకు దన్ను

1 Mar, 2016 05:03 IST|Sakshi
వెన్నముకకు దన్ను

వ్యవసాయ రంగానికి... రూ. 44,485 కోట్లు
బ్యాంకుల ద్వారా పంట రుణాల లక్ష్యంరూ. 9,00,000 కోట్లు

పంటల బీమా పథకానికి..రూ.5,500కోట్లు
కొత్తగా సాగులోకి..28.5లక్షల ఎకరాలు
వచ్చే ఏడాది కల్లా 14కోట్ల మంది రైతులకు భూసార కార్డులు..
వర్షపు నీటి నిల్వకు నీటి గుంతలు, కొలనులు.. 5లక్షలు
సేంద్రియ సాగు లక్ష్యం..5లక్షల ఎకరాలు పాడి పరిశ్రమాభివృద్ధికి..రూ.850కోట్లు
ఇ-మార్కెట్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం
సేంద్రియ సాగు, ఎరువులకు ప్రోత్సాహం

వ్యవసాయానికి ఊతమిచ్చేందుకు బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన మరిన్ని అంశాలివీ.. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన పథకాన్ని సమర్థంగా అమలు చేస్తాం. కొత్తగా 28.5 లక్షల ఎకరాలను సాగు పరిధిలోకి తెస్తాం పాడి పరిశ్రమకు ఊతమిచ్చేందుకు రూ.850 కోట్లు వెచ్చిస్తాం. పశుధన్ సంజీవని, నకుల్ స్వాస్థ్య పత్ర, ఇ-పశుధన్ హాత్  పథకాలతోపాటు దేశీయ పాడి సంతతిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న నేషనల్ జినోమిక్ కేంద్రానికి ఈ నిధులను వెచ్చిస్తాం.

వచ్చే మూడేళ్లలో ఐదు లక్షల ఎకరాలను సేంద్రియ సాగు పరిధిలోకి తెస్తాం. ఇందుకు రూ.412 కోట్లు వెచ్చిస్తాం. రూ.6 వేల కోట్లతో భూగర్భ జలాల పెంపు, సంరక్షణ చర్యలు. రూ.368 కోట్లతో భూసార పరిరక్షణ చర్యలు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వర్షపు నీటిని నిల్వచేసేందుకు 5 లక్షల నీటి కొలనులు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తాం. ఇదే పథకం ద్వారా 10 లక్షల సేంద్రియ ఎరువు తయారీ గుంతలు ఏర్పాటు చేస్తాం వచ్చే మూడేళ్లలో విత్తన, భూసార పరీక్షలు కూడా చేసుకునేందుకు వీలుండే 2 వేల ఎరువుల దుకాణాలను ఏర్పాటుచేస్తాం

సుదీర్ఘ వ్యవసాయ అవసరాల కోసం నాబార్డ్‌లో ప్రత్యేక  నిధిని ఏర్పాటు చేస్తాం. తొలి దశ కింద రూ.20 వేల కోట్లు కేటాయిస్తాం పశుధన్ సంజీవని కింద పశువులకు ఆరోగ్య కార్డులు అందజేస్తాం  కిందటి ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.8.5 లక్షల కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి రూ.9 లక్షల కోట్లు అందిస్తామని తెలిపారు. ఇంత పెద్ద లక్ష్యం నిర్దేశించుకోవడం ఇదే తొలిసారి.

న్యూఢిల్లీ ;వరుసగా రెండేళ్లపాటు కరువుతో సంక్షోభంలో పడ్డ వ్యవసాయ రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు దన్నుగా ఉంటామంటూ బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. సాగుకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ కేటాయింపుల్ని దాదాపు రెట్టింపు చేసింది. సాగు, పాడి రంగాలకు మొత్తంగా రూ.44,485 కోట్లు కేటాయించింది. దేశంలో రైతుల ఆదాయాన్ని 2022కల్లా రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2016-17లో రైతులకు రూ.9 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. అలాగే సాగు రుణాల వడ్డీ చెల్లింపుల్లో రైతులకు సాయం అందించేందు కు బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయించారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకానికి రూ.5,500 కోట్లు ప్రతిపాదించారు. పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు రూ.500 కోట్లు కేటాయిం చారు. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశంలో 14 కోట్ల మంది రైతులకు భూసార పరీక్ష కార్డులు అందజేస్తామన్నారు.

దేశవ్యాప్తంగా రైతులకు కనీస మద్దతు ధర దక్కేందుకు వీలుగా... ఆన్‌లైన్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇందుకు ఎంపిక చేసిన 585 హోల్‌సేల్ మార్కెట్లలో వ్యవసాయ ఏకీకృత ఇ-మార్కెట్ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 14న ఈ పథకాన్ని జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ఈ పథకంలో చేరేందుకు వీలుగా ఇప్పటికే 12 రాష్ట్రాలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ(ఏపీఎంసీ) చట్టాన్ని సవరించుకున్నాయని, ఈ ఏడాది మరిన్ని రాష్ట్రాలు ఇందులో చేరనున్నాయని వివరించారు. దేశ ఆహార భద్రతకు రైతు వెన్నెముకగా నిలుస్తున్నాడని, అతడికి ఆర్థిక భద్రత అందించాల్సిన అవసరం ఉందని జైట్లీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

 వేగంగా 89 సాగునీటి ప్రాజెక్టుల పనులు
సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 89 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 80.6 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుందన్నారు. వీటికి వచ్చే ఏడాది రూ.17 వేల కోట్లు, రాబోయే ఐదేళ్లలో రూ.86,500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఈ 89 ప్రాజెక్టులలో 2017 మార్చి 31 నాటికి కనీసం 23 ప్రాజెక్టులను పూర్తిచేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు