బస్సులో భద్రంగా వెళ్లేలా చూస్తా

27 Feb, 2014 04:53 IST|Sakshi
బస్సులో భద్రంగా వెళ్లేలా చూస్తా

దేశం ‘సూపర్ పవర్’గా ఎదిగేకన్నా మహిళల భద్రతే ముఖ్యం: రాహుల్  గువాహటి: దేశాన్ని ‘సూపర్‌పవర్’గా నిలిపేకన్నా మహిళలు బస్సులో సురక్షితంగా ప్రయాణించేలా చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. దేశాన్ని ప్రపంచ శక్తిగా మారుస్తామంటూ కొందరు పెద్దపెద్ద మాటలు చెబుతున్నారని...కానీ అతివల భద్రతకే తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు. బుధవారం అస్సాంలోని గువాహటిలో డాన్ బాస్కో యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్‌గాంధీ ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
 
  ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులను ఉద్దేశించి ‘‘మీరు బస్సులో సురక్షితంగానే ప్రయాణిస్తున్నారా? వీధుల్లో ఇబ్బందిపడకుండా నడిచి వెళ్లగలుగుతున్నారా?’’ అని అడిగారు. బస్సులో వెళ్లేందుకు కకోలీ (స్త్రీలను గౌరవించడంపై రాహుల్‌ను ఓ ప్రశ్న అడిగిన విద్యార్థినిని ఉద్దేశించి) భయపడుతుంటే దేశం సూపర్‌పవర్‌గా ఎదిగేందుకు అవకాశమే లేదన్నారు.
 
 ‘బస్సులో ప్రయాణించేందుకు ఓ యువతి జం కుతుంటే మనల్ని మనం సూపర్ పవర్‌గా ఎలా పిలుచుకోగలం? దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలు బస్సులో ప్రయాణించేటప్పుడు, రోడ్డుపై నడిచి వెళ్లేటప్పుడు సురక్షితంగా ఉంటున్నారా అని అడిగితే ప్రతి ఒక్కరూ లేదనే చెబుతారు.
 
 వారు సురక్షితంగా ఉన్నారనుకోవట్లేదు. మన రాజకీయ వ్యవస్థలో వారికి ప్రాతినిధ్యం లభించట్లేదు. దీనిపై యువకులంతా ఆలోచించాలి. ఇది వారికో సందేశం’’ అని రాహుల్ అన్నారు. తన 45 ఏళ్ల జీవితానుభవంలో మగవారికన్నా మహిళలే తెలివిగలవారని, సమర్థులని రాహుల్ పేర్కొన్నారు. కాగా, మరో కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతుండగా ఓ మహిళ ఆయనకు ముద్దుపెట్టడం విశేషం.
 

మరిన్ని వార్తలు