ఆధార్ కు చట్టబద్ధత

1 Mar, 2016 03:59 IST|Sakshi
ఆధార్ కు చట్టబద్ధత

ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు
ఆధార్ వినియోగాన్ని మరింత విస్తృతం చేస్తామన్న జైట్లీ
ఎరువుల సబ్సిడీ ‘ప్రత్యక్ష బదిలీ’పై త్వరలో పైలట్ ప్రాజెక్టు

న్యూఢిల్లీ: వివిధ వర్గాల వ్యతిరేకత, సుప్రీంకోర్టు మొట్టికాయల నేపథ్యంలో ‘ఆధార్’కు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, అర్హులకే సబ్సిడీలు అందించడానికి ఆధార్ ఆవశ్యకమని... అందువల్ల ఆధార్‌కు చట్టబద్ధత కల్పించనున్నామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. పేదలు, బలహీనవర్గాలకు ప్రయోజనం కల్పించేలా పారదర్శకంగా వ్యవహరించేందుకు ఆధార్ తోడ్పడుతుందన్నారు. బిల్లు సిద్ధంగా ఉందని, మరో రెండు రోజుల్లో దీన్ని పార్లమెంట్ ముందుకు తెస్తామని చెప్పారు. చట్టబద్ధత కల్పించడం ద్వారా ఆధార్ వినియోగాన్ని మరింత విస్తృతం చేసి, మరిన్ని అభివృద్ధి చర్యలకు అనుసంధానిస్తామని తెలిపారు.

భారత సంచిత నిధి నుంచి కల్పించే అన్ని రకాల సబ్సిడీలు, సేవలు, ప్రయోజనాలను ఆధార్ ద్వారా అందజేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 98 కోట్ల మంది ఆధార్ నంబర్‌ను పొందారని... రోజూ సుమారు 26 లక్షల మంది నేరుగా, మరో 1.5 లక్షల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. వంటగ్యాస్‌కు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీఎల్) పథకం కింద 16.5 లక్షల మంది ప్రయోజనం పొందుతుండగా... అందులో 11.19 కోట్ల మంది తమ ఆధార్ నంబర్లను అనుసంధానం చేసుకున్నారని వెల్లడించారు. త్వరలోనే ఎరువుల సబ్సిడీని కూడా నేరుగా రైతులకే అందజేసే పథకాన్ని దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నామని జైట్లీ తెలిపారు. ఇక వివిధ సబ్సిడీ పథకాలను ఆధునీకరించడంలో భాగంగా... దేశవ్యాప్తంగా లక్ష రేషన్ దుకాణాలను కంప్యూటరీకరించనున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు