అర్ధరాత్రి చెట్లు కొట్టాల్సిన అవసరం ఏంటి?

5 Oct, 2019 09:22 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలోని ఆరే కాలనీలో అర్ధరాత్రి చెట్ల నరికివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెట్లను పడగొట్టవద్దంటూ వందలాది మంది పర్యావరణ కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేసి అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. గోరెగావ్‌ సమీపంలోని ఆరేకాలనీలో కార్ల పార్కింగ్‌ కోసం షెడ్డు నిర్మించేందుకు ముంబై మెట్రో నిర్ణయించింది. ఇందుకోసం భారీ సంఖ్యలో చెట్ల నరికివేత కార్యక్రమానికి పూనుకుంది. ఈ నేపథ్యంలో మెట్రో నిర్ణయాన్ని నిరసిస్తూ పర్యావరణ కార్యకర్తలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు చెట్ల నరికివేత అడ్డుకోవాలంటూ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ క్రమంలో శుక్రవారం పిటిషన్లను విచారించిన హైకోర్టు వాటిని కొట్టివేసింది. దీంతో మెట్రో అధికారులు రాత్రి సమయంలో నరికివేత పనులను ప్రారంభించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పర్యావరణ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బుల్డోజర్లకు అడ్డుగా నిలబడి శాంతియుతంగా నిరసన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ముంబై నిబంధనల ప్రకారం కోర్టు ఆర్డర్‌ వెబ్‌సైట్‌లో పెట్టిన 15 రోజుల తర్వాతే చెట్లు నరికివేసే వీలుంటుందని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. కానీ మెట్రో అధికారులు మాత్రం అర్ధరాత్రి అత్యుత్సాహం ప్రదర్శించి చెట్లను నరికివేయడం దారుణమని పేర్కొన్నారు.

కాగా ఈ ఘటనపై శివసేన చీప్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, వర్లీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిత్య ఠాక్రే సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు... ‘ మెట్రో 3 పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాల్సింది. కానీ అర్ధరాత్రి ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. భారీగా పోలీసులను మోహరించి ఇలా చేయాల్సిన అవసరం ఏముంది. ఈ ప్రాజెక్టు ముంబైకి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే ప్రయోజనం చేకూరుస్తుంది అనుకున్నాం గానీ, ఇలా చెట్లను నరకుతుంది అనుకోలేదు అని వరుస ట్వీట్లు చేశారు. ఇక గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ సైతం పోలీసుల తీరును విమర్శించారు. ‘ ఆరేలో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై లాఠీచార్జీ చేశారు. వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అసభ్య పదజాలంతో దూషించారు. మహిళలను ఇష్టం వచ్చినట్లుగా నెట్టివేశారు. ఇది చట్టవ్యతిరేక చర్య’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు