డీజే ఆరోపణలు.. ఎయిర్‌ ఇండియా రిప్లై

24 Aug, 2018 17:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్‌ ఇండియా సిబ్బంది తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఇటాలియన్‌ డీజే ఒల్లీ ఎస్సే చేసిన ఆరోపణలపై ఎయిర్‌ ఇండియా స్పందించింది. ఇటాలియిన్‌ డీజే చేసిన ఆరోపణలు అసత్యమైనవని, తమ సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించలేదని కొట్టిపారేసింది. సమయానికి పోలీసులు కూడా అందుబాటులో లేరని ఆరోపించిన ఇటాలియన్‌ డీజేకు విమానశ్రయ పోలీసు అధికారి బదులిచ్చారు. సంఘటన జరిగిన రోజంతా తాను పోలీస్‌ స్టేషన్‌లోనే ఉన్నానని, తమ అధికారులు చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమెకు వివరించారు.

అసలేం జరిగిందంటే..
ఇటాలియన్‌ డీజే ఒల్లీ ఎస్సే హైదరాబాద్‌ పర్యటనకు వచ్చారు. అనంతరం తిరుగు పయనంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఎయిర్ ఇండియా సిబ్బంది తనపై చేయి చేసుకున్నట్టు ఆరోపించారు. ఈ క్రమంలో వారిపై కేసు పెట్టేందుకు విమానశ్రయ పోలీసు స్టేషన్ వద్దకు వెళ్తే ఎస్సై లేడని, తమకు ఏం తెలియదని అక్కడి పోలీసులు చెప్పారని.. అంతే కాకుండా అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని వివరించారు.  విమానశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రయాణించాల్సిన ఎయిర్ ఇండియా విమానం 9 గంటలు ఆలస్యమైందని, అందుకే తాను ఎక్కాల్సిన విమానం ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు డిపరేచర్ గేటు వద్దనున్న అధికారుల దగ్గరికి వెళ్లినట్లు వీడియోలో పేర్కొన్నారు. కానీ, అక్కడి సిబ్బంది స్పందించకపోవడంతో పక్కనే ఎయిర్ ఇండియా కౌంటర్ వద్దకు వెళ్లి అడగగా అది తనపని కాదని బిగ్గరగా అరిచారని, మరోసారి అడిగితే చేయిచేసుకున్నారని వీడియోలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు