‘అమితాబ్‌ కోసం వస్తే 26/11 దాడుల్లో ఇరికించారు’

26 Nov, 2018 19:51 IST|Sakshi

ముంబై : ‘నేను అమితాబ్‌ బచ్చన్‌కి పెద్ద ఫ్యాన్‌ని.. ఆయన బంగ్లా చూడటానికి ఇండియా వచ్చాను. కానీ ‘రా’ అధికారులు నా పాస్‌ పోర్ట్‌ లాక్కుని నన్ను అరెస్ట్‌ చేశారు’.. ఇవి కరుడు కట్టిన పాకిస్తాన్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ కోర్టు ముందు చెప్పిన కట్టుకథ. ముంబై 26/11 ఉగ్ర దాడులు జరిగి నేటికి పదేళ్లు పూర్తయ్యాయి. కానీ ఈ దాడి తాలుకా గాయం నేటికి పచ్చిగానే ఉంది. దాదాపు 166 మంది అమాయకులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. యావత్‌ దేశాన్ని భయకంపితం చేసిన ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. అయితే వీరిలో అజ్మల్‌ కసబ్‌ మాత్రమే ప్రాణాలతో పోలీసులకు చిక్కాడు. ఉగ్రదాడుల తరువాత జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు కసబ్‌ని విచారించిన నాటి పోలీసు అధికారి రమేష్ మహలే.

ముంబై 26/11 దాడుల కేస్‌ విచారణాధికారిగా నియమితులయ్యారు మహలే. అప్పటి విషయాలను తల్చుకుంటూ.. ‘కసబ్‌ చాలా తెలివిగలవాడు. పోలీసులను బురిడి కొట్టి తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ దాడికి సంబంధించిన వివరాలు సేకరించడానికి మాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే అబద్దాలు చెప్పడం కసబ్‌ ప్రవృత్తి. కానీ నేర విచారణ విభాగంలో నాది దాదాపు 25 ఏళ్ల అనుభవం. నేను రాకేష్‌ మరియా, దేవెన్‌ భార్తి వంటి అనుభవజ్ఞులైన అధికారులతో కలిసి పని చేశాను. ఆ అనుభవం నాకు 26/11 కేసు విచారణ సమయంలో బాగా ఉపయోగపడిందంటూ చెప్పుకొచ్చారు మహలే.

‘పోలీసుల ముందు తన నేరాన్ని ఒప్పుకోవడానికి ముందు కసబ్‌ పలు అసాధరణమైన అబద్దాలు చెప్పాడు. విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొచ్చాక అతడి అబద్దాలు మరింత ముదిరాయి. కోర్టులో ఏకంగా అమితాబ్‌ బచ్చన్‌ పేరును వెల్లడించాడు. తాను అమితాబ్‌ బచ్చన్‌కి వీరాభిమానినని తెలిపాడు. కేవలం బిగ్‌బీ నివాసం చూడటం కోసమే తాను ఇండియా వచ్చానని.. కానీ రా అధికారులు తన మీద తప్పుడు కేసు నమోదు చేశారంటూ కసబ్‌ కోర్టులో ఆరోపించాడు. రా అధికారులు తన దగ్గరకు వచ్చి తన పాస్‌పోర్టును లాక్కుని.. చించివేశారని.. తరువాత తనను 26/11 దాడులు జరిగిన ప్రాంతానికి తీసుకొచ్చారని తెలిపాడు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారంటూ’ కసబ్‌ వాదించాడని మహలే గుర్తు చేసుకున్నారు.

‘అయితే కసబ్‌ చెప్పేవన్ని అబద్దాలే. వాటన్నింటికి మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఏకే 47 తుపాకీ పట్టుకుని  ఛత్రపతి శివాజీ టర్మినల్‌ దగ్గర నిల్చున్న కసబ్‌ ఫోటో అక్కడ ఉన్న సీసీటీవీలతో పాటు.. జర్నలిస్ట్‌ల దగ్గర  కూడా ఉంది. దాంతో కసబ్‌ వాదనలు ఏ కోర్టులో నిలవలేదు. ఆ తరువాత నెమ్మదిగా కసబ్‌ ఈ దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించడం ప్రారంభించాడు. కసబ్‌ని 2012లో భారత ప్రభుత్వం ఉరితీసింది. ‘అల్లా కసమ్, ఐసి గల్తీ దొబార నహీ హోగీ’.. ‘అల్లా మీద ప్రమాణం. ఇలాంటి తప్పు మళ్లీ చెయ్యను’ ఉరితీసే ముందు అజ్మల్‌ కసబ్‌ చివరి మాటలివి.

పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి 2008 నవంబరు 26న లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది చొరబడ్డారు. ఒబెరాయ్ హోటల్, తాజ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ల వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు.

మరిన్ని వార్తలు