నిత్యావసరాలపై తగ్గనున్న పన్ను?

6 Nov, 2017 02:54 IST|Sakshi

ఈ నెల 10న జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో నిర్ణయం

న్యూఢిల్లీ: నిత్యం ఉపయోగించే కొన్ని వస్తువులపై పన్ను రేట్లను తగ్గించే అంశాన్ని జీఎస్‌టీ మండలి పరిశీలించనుంది. హ్యాండ్‌మేడ్‌ ఫర్నీచర్, ప్లాస్టిక్‌ వస్తువులు, ఎలక్ట్రిక్‌ స్విచ్‌లు, షాంపు తరహా నిత్యావసర వస్తువులపై పన్ను రేట్లను తగ్గించడంపై మండలి పరిశీలించనుంది. 28 శాతం పన్ను ఉన్న పలు నిత్యావసర వస్తువులపై నవంబర్‌ 10న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలోని జీఎస్‌టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలపై కూడా పన్ను రేట్లను క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. ‘28 శాతం శ్లాబులో ఉండే వస్తువులపై పన్నును క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులు దాదాపుగా 18 శాతం పన్ను రేటు పరిధిలోకి రావచ్చు.

ఫర్నీచర్, ఎలక్ట్రిక్‌ స్విచ్‌లు, ప్లాస్టిక్‌ పైపుల పన్ను రేట్లపై పునఃపరిశీలిస్తాం’అని ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం అన్ని రకాల ఫర్నీచర్‌ వస్తువులపై 28 శాతం జీఎస్‌టీ ఉంది. అసంఘటిత రంగంలోని కార్మికులు తయారుచేసే హ్యాండ్‌మేడ్‌ ఫర్నీచర్‌పై జీఎస్‌టీ తగ్గించాలని డిమాండ్లు వచ్చాయి. దాదాపుగా కొన్ని ప్లాస్టిక్‌ వస్తువులపై 18 శాతం పన్ను ఉన్నప్పటికీ షవర్‌ బాత్, వాష్‌ బేసిన్, సీట్లు, వాటి కవర్లు తదితర వస్తువులపై 28 శాతం పన్ను విధిస్తున్నారు. వీటన్నింటిపై కూడా పన్నును క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. ప్లాసిక్‌ పరిశ్రమలో 80 శాతం వాటా చిన్న, మధ్య తరహా వ్యాపారా లదేనని ఇటీవల రెవెన్యూ విభాగానికి తయారీదారులు వినతిపత్రం ఇచ్చారు. బరువు తూచే యంత్రాలు (వేయింగ్‌ మెషిన్‌), కంప్రెసర్లపై పన్ను రేటును కూడా 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు