తాకట్టులో ‘విద్యార్హత’!

6 Nov, 2017 02:54 IST|Sakshi

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక విద్యార్థుల ఇక్కట్లు 

కోర్సు ముగిసినా కాలేజీల చుట్లూ్ట ప్రదక్షిణలు

సొంతంగా ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తున్న యాజమాన్యాలు  

2016–17 బకాయిలు రూ.1,683 కోట్లు 

ఉప్పల్‌కు చెందిన అభినవ్‌ గండిపేట్‌లోని ప్రఖ్యాత ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తి చేశాడు. డిస్టింక్షన్‌లో పాసయ్యాడు. క్యాంపస్‌ సెలక్షన్‌లో విప్రో (చెన్నై)లో ఉద్యోగం సాధించాడు. ఈ నేపథ్యంలో ఉద్యోగంలో చేరేందుకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకురావాలని కంపెనీ స్పష్టం చేసింది. దీంతో కాలేజీకి వెళ్లిన అభినవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రూ.2.20 లక్షల ఫీజు బకాయి ఉందని, డబ్బులు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ అభినవ్‌.. చివరకు సమీప బంధువు వద్ద డబ్బు వడ్డీకి తెచ్చి కాలేజీలో చెల్లించాడు. 

కేవలం అభినవ్‌ ఉదంతమే కాదు.. ప్రస్తుతం రాష్ట్రంలో వేలాది మంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నాయి. కొందరు విద్యార్థులు అప్పు చేసి ఫీజులు చెల్లిస్తుండగా.. స్థోమత లేని విద్యార్థులు సర్టిఫికెట్లను కాలేజీల్లోనే వదిలేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగాలు పొందలేక, పై చదువులకు వెళ్లలేక సతమతమవుతున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: పోస్టు మెట్రిక్‌ విద్యలో కీలకమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ పథకం కింద చెల్లింపుల్లో సర్కారు తీవ్ర జాప్యం చేయడంతో విద్యార్థులు సంకట స్థితిని ఎదుర్కొం టున్నారు. 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులు ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు కోర్సు పూర్తి చేసినా సర్టిఫికెట్లు పొందలేదు. ఫీజులు చెల్లించి ధ్రువపత్రాలు పొందాలని, లేకుంటే ప్రభుత్వం నిధులు విడుదల చేశాక తీసుకోవాలని కాలేజీలు తేల్చి చెబుతున్నాయి. 

బకాయిలు రూ.1,683.59 కోట్లు.. 
గత విద్యా సంవత్సరంలో పోస్టు మెట్రిక్‌ విద్యార్థుల ఫీజులు, ఉపకార వేతనాలకు సంబంధించి ప్రభుత్వం రూ.2,424.61 కోట్లు కేటాయించింది. ఇందులో గత రెండు త్రైమాసికాల్లో రూ.741.01 కోట్లు విడుదల చేయగా.. ఇంకా రూ.1,683.59 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఉపకార వేతనాలకు సంబంధించి రూ.506.79 కోట్లున్నాయి. వాస్తవానికి ఉపకార వేతన నిధులను నెలవారీగా విడుదల చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం అందులోనూ జాప్యం చేస్తోంది. బకాయిల చెల్లింపులు మార్చిలోపు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు విద్యార్థులపై పలు కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఫ్రెషర్స్, రెన్యువల్‌ విద్యార్థులకు కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ కోర్సు పూర్తి చేసిన వాళ్లు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. కోర్సు సర్టిఫికెట్లను యాజమాన్యాలు అట్టిపెట్టుకోవడంతో తదుపరి చదువులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరికొందరు ఉద్యోగాలు వచ్చినప్పటికీ సర్టిఫికెట్లు లేక వాటిని వదులుకుంటున్నారు. 

గుదిబండగా నిర్వహణ .. 
ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రైవేటు యాజమాన్యాలే కీలకం. అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమిచ్చే ఫీజులతోనే ప్రైవేటు కాలేజీలు నిర్వహిస్తున్నాం. కానీ మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ప్రైవేటు కాలేజీల నిర్వహణ గుదిబండగా మారుతోంది. అటు విద్యార్థులను కోర్సు మధ్యలో పంపించలేక.. అప్పులు చేసి నిర్వహించలేక సతమతమవుతున్నాం. అరకొర ఫీజులిస్తూ నాణ్యత, ప్రమాణాలంటూ ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదు. ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయలేని పరిస్థితితో ఆందోళన చెందుతున్నాం. 
    – సతీశ్, ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం గౌరవాధ్యక్షుడు       

మరిన్ని వార్తలు