అలోక్‌ వర్మ చేతికి సీవీసీ నివేదిక ప్రతి

16 Nov, 2018 12:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీవీసీ నివేదిక ప్రతిని వర్మకు అందచేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం పేర్కొంది. నివేదికపై సీల్డ్‌ కవర్‌లో సమాధానం తెలపాలని కోరింది. వర్మపై సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్ధానా చేసిన ఆరోపణలపై సీవీసీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది.

సీబీఐ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ అలోక్‌ వర్మ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. మరోవైపు సీవీసీ న్యాయవాదినైనా తానిప్పటివరకూ దర్యాప్తు నివేదికను చూడలేదని విజిలెన్స్‌ కమిషన్‌ తరపు న్యాయవాది తుషార్‌ మెహతా పేర్కొన్నారు. నివేదికను రూపొందించింది మీరే అయినా దాన్ని మీరు చూడలేదా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ పేర్కొనగా, ఓ న్యాయవాదిగా తాను నివేదికను పరిశీలించలేదని మెహతా చెప్పుకొచ్చారు.ఇక నివేదిక ప్రతిని తనకు అందచేయాలన్న రాకేష్‌ ఆస్ధానా వినతిని ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చారు.

మరిన్ని వార్తలు