ఆయుధాలు లేకుండా సరిహద్దుల్లో ఎలా..

19 Jun, 2020 08:36 IST|Sakshi

చంఢీగఢ్‌ : గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా మధ్య చోటుచేసుకున్న ఘర్ణణలో భారత జవాన్ల మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చైనా దొంగదెబ్బకు ప్రతీకారం తీసుకోవాల్సిందేనని ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. డ్రాగన్‌ ఉద్దేశపూర్వకంగానే భారత జవాన్లపైకి దాడికి పాల్పడిందని, ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఘర్షణకు దిగే ప్రయత్నం చేసేవీలులేదని మాజీ సైనికులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులపై సైన్యంలో పనిచేసిన అనుభవమున్న పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ స్పందించారు. శుక్రవారం ఉదయంం ఓ జాతీయ మీడియాతో  సీఎం మాట్లాడుతూ.. భారత్‌-చైనా దేశాల మధ్య  ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఆయుధాలు లేకుండా భారత సైనికులను సరిహద్దుకు ఎందుకు పంపారని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలో కేంద్రమే నిర్ణయించుకోవాలని అన్నారు. (చైనా కాఠిన్యం: భారత జవాన్లపై కర్కశం)

భారత సైనికుల మృతికి చైనాపై తప్పనిసరిగా ప్రతీకారం తీసుకోవాల్సిందేనని, వారు ఒక్కళ్లు చంపితే మనం ఐదుగురిని చంపాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు.  పుల్వామా, బాలాకోట్‌ ఉగ్రదాడులకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో.. చైనా దుస్సాహాసాన్ని కూడా అదే రీతితో తిప్పికొట్టాలని అమరిందర్‌ సింగ్‌ స్పష్టం చేశారు. అయితే చైనాతో యుద్ధమంటే పాకిస్తాన్‌తో పోరాడినంత సులువు కాదని, చైనా ఆర్మీ ప్రత్యర్థిపై అత్యంత కాఠిన్యంగా వ్యవహరిస్తుందని తన అనుభవాలను పంచుకున్నారు. తాను సైన్యంలో చేరిన తొలినాళ్లలో చైనా సరిహద్దులో విధులు నిర్వర్తించానని, వారి ఆగడాలను ఎదుర్కొవడం అంత సమాన్యమైన విషయం కాదని గుర్తుచేసుకున్నారు. ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం మేలుకోని పాకిస్తాన్‌, చైనా, నేపాల్‌ సరిహద్దుల్లో గస్తీకాస్తున్న జవాన్లకు అత్యాధునికమైన ఆయుధాలను అందించాలని కోరారు. (భారత్‌ను దెబ్బతీసేందుకు త్రిముఖ వ్యూహం)

కాగా ఈనెల 16వ తేదీని ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది చైనాకు చెందిన మరికొంత జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఘటన నేపథ్యంలో భారత్‌-చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరు పక్షాల జరనల్‌ స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు