కీలక శాఖలు వీరికే..

31 May, 2019 13:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  ప్రధాని నరేంద్ర మోదీ తన క్యాబినెట్‌లో మంత్రులకు శాఖలను కేటాయించారు. నెంబర్‌ టూగా వ్యవహరిస్తున్న అమిత్‌ షాకు హోంశాఖను కేటాయించారు. కీలక ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్‌కు కట్టబెట్టారు. ఇక రాజ్‌నాథ్‌ సింగ్‌కు రక్షణ మంత్రిత్వ శాఖను కేటాయించారు. గత మోదీ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించిన అరుణ్‌ జైట్లీ అనారోగ్య కారణంతో మంత్రి పదవిని చేపట్టలేనని ప్రధానికి స్పష్టం చేసిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖను అప్పగించారు.

ఇందిరా గాంధీ తర్వాత ఆమే..

ఇందిరా గాంధీ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ నిర్మలా సీతారామన్‌ కావడం గమనార్హం. 1969-70ల్లో కొద్ది కాలం ఇందిరా గాంధీ ఆర్థిక మం‍త్రిత్వ శాఖనూ చేపట్టారు. ఇక 2017లో  మోదీ క్యాబినెట్‌లో కేంద్ర రక్షణశాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు తీసుకున్నారు. దేశ రక్షణశాఖను నిర్వహించిన తొలి మహిళాగా ఖ్యాతికెక్కారు నిర్మలాసీతారామన్‌. ఆ శాఖ బాధ్యతలను ఏడాదిన్నరపాటు నిష్కళంకంగా.. సమర్థంగా నిర్వహిస్తూ మోదీ ప్రశంసలు అందుకున్నారు. రఫేల్‌ ఒప్పందంపై ప్రతిపక్షనేత రాహూల్‌గాంధీ తీవ్రస్థాయిలో బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డ సందర్భంలో నిర్మలాసీతారామన్‌ పార్లమెంటులో మోదీకి వెన్నుదన్నుగా తన వాణిని వినిపించారు. కశ్మీర్‌లో పాకిస్తాన్‌ ఉగ్రవాదులు మన జవానులను మట్టుపెట్టిన తరువాత, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నేపథ్యంలో నిర్మలాసీతారామన్‌ పనితీరుపై ప్రశంసలు వచ్చాయి

అమిత్‌ షాకు అందలం

బీజేపీ చీఫ్‌గా లోక్‌సభ ఎన్నికల్లో మోదీతో పాటు పార్టీ అఖండ విజయానికి బాటలు పరిచిన అమిత్‌ షా తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో అడుగుపెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా పలు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు ట్రబుల్‌ షూటర్‌గానూ ఆయన పేరొందారు. బీజేపీ ఉనికిలేని రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరణకు వ్యూహాలకు పదునుపెట్టడంలో అమిత్‌ షా ఆరితేరారు.  మోదీకి అత్యంత సన్నిహితుడైన అమిత్‌ షా గతంలో మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. ఒకానొక దశలో అమిత్‌ షా గుజరాత్‌ మంత్రిగా పలు పోర్ట్‌పోలియాలను నిర్వహించారు. స్టాక్‌ మార్కెట్‌ బ్రోకర్‌ నుంచి అంచెలంచెలుగా ఆయన అత్యున్నత స్ధాయికి చేరుకున్నారు.

విధేయతకు పట్టం

ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు గత క్యాబినెట్‌లో హోంశాఖను సమర్ధంగా నిర్వహించిన అనుభవం ఉంది. సీనియర్‌ మం‍త్రిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రధాని మోదీ సన్నిహితుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. గతంలో యూపీ ముఖ్యమంత్రిగా, బీజేపీ చీఫ్‌గానూ వ్యవహరించిన రాజ్‌నాథ్‌ సింగ్‌కు పార్టీ దిగ్గజ నేతలతో పాటు ఆరెస్సెస్‌ అగ్ర నేతలతోనూ విస్తృత పరిచయాలున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయతీరాలకు చేరాలంటే మోదీ నాయకత్వం అవసరమంటూ ఎల్‌కే అద్వాణీ సహా పార్టీ కురువృద్ధులను ఒప్పించడంలో రాజ్‌నాథ్‌ కీలక పాత్ర పోషించారు.

మరిన్ని వార్తలు