అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఎలా?

31 Dec, 2017 13:33 IST|Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ లో సినిమాలతో మెగాస్టార్‌ గా అమితాబ్‌ బచ్చన్‌ ఎంత సక్సెస్‌ అయ్యాడో.. రాజకీయంగా వైఫల్యం చెందిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయాడు. కొన్నాళ్ల‌పాటు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల ద్వారా ఆయన ప్రస్థానాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే. 1984లో కాంగ్రెస్‌లో చేరిన బిగ్ బీ.. అల‌హాబాద్ స్థానం నుంచి బంప‌ర్ మెజార్టీతో ఎంపీగా ఎన్నిక‌య్యాడు. అయితే బోఫోర్స్ స్కామ్ త‌ర్వాత అమితాబ్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పాడు. అప్ప‌టి నుంచి ఇక పాలిటిక్స్‌కు దూరంగానే ఉంటున్న.. ఆయన తాను జీవితంలో చేసిన తప్పు అదేనని పలుమార్లు చెప్పటం చూశాం. 

అదే సమయంలో స్నేహితుడు అయిన రజనీ రాజకీయ ప్రవేశంపై కూడా ఆయన ఆ మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతోపాటు మరికొందరు ఫెయిల్యూర్స్‌ స్టార్ల ప్రస్తావన తీసుకొచ్చి రజనీ ఇందులో దిగకపోవటమే మంచిదని మీడియా సమక్షంలోనే సూచించాడు. రజనీ రాజకీయాల్లోకి రావొద్దని బలంగా కోరుకునే వ్యక్తిని తానేనని.. ఒకవేళ రజనీ మనసులో రావాలని ఉంటే మాత్రం తానేం చేయలేనని అమితాబ్‌ చెప్పారు. కానీ, ఇప్పుడు రజనీ ప్రకటన అనంతరం ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు బిగ్‌ బీ. 

‘‘నా సహచర నటుడు, ఆప్తుడు అయిన రజనీ రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించాడు. రాజకీయాల్లో అతను రాణించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’’ అని బిగ్‌ బీ ఓ ట్వీట్‌ చేశారు. కాగా, కాలా షూటింగ్‌ సందర్భంగా ముంబై వెళ్లిన సమయంలో అమితాబ్‌ తో రాజకీయాలపై రజనీ చర్చించినట్లు అప్పట్లో జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే అనారోగ్యం కారణాలు వెంటాడుతున్న రజనీ ఆ విషయంలో ఆలోచించుకోవాలని అమితాబ్‌ సూచించాడని అప్పటి వార్తల సారాంశం.

మరిన్ని వార్తలు