ఉద్యోగం రావాలంటే పది చిట్కాలు

3 Jun, 2017 16:19 IST|Sakshi
ఉద్యోగం రావాలంటే పది చిట్కాలు

న్యూఢిల్లీ: యూనివర్శిటీల్లో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం బయటకు వచ్చినప్పుడు ఎవరికైనా అగమ్యగోచరంగాను, ఆందోళనగానూ ఉంటుంది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి గుండెలో దడ మొదలవుతుంది. నేటి పోటీ ప్రపంచంలో నిలబడి ఉద్యోగాన్ని సంపాదించగలనా? నాకున్న అర్హతలు అందుకు సరిపోతాయా? ఇంటర్వ్యూదాకా నెట్టుకు రాగలనా ? వచ్చినా, ఎంతో మంది అనుభవజ్ఞులను వదిలేసి ఆ ఉద్యోగం నన్ను వరిస్తుందా?...

ఇలా పరిపరి విధాల ఆందోళనకరమైన ఆలోచనలు మెదుడులో సుడులు తిరిగడం సాధారణమే. ఇలాంటి వారి కోసం అడ్వర్టయిజింగ్‌ విభాగంలో 20 ఏళ్ల అనుభవం కలిగి వెయ్యి మందికిపైగా ఉద్యోగావకాశాలు కల్పించిన (వారిలో ఎక్కువ మంది కొత్తవారే) ‘మార్కెటింగ్‌ ఫింగర్‌ఫేంట్‌’ వ్యవస్థాపకులు ఎడ్‌ మిట్‌జెన్‌ పది చిట్కాలు చెబుతున్నారు.

1. తొందరగా ఉద్యోగం రాకపోతే నిరుత్సాహం వద్దు....
 ఉద్యోగావకాశాలు రావడంలో చాలా జాప్యం జరగవచ్చు. కొందరికి రెండు, మూడు నెలల్లో ఉద్యోగం దొరికితే మరికొందరికి ఏడాది వరకు ఉద్యోగం దొరక్కపోవచ్చు. అలాంటి వారు అయ్యో నాకు ఉద్యోగం రావడం లేదే...అనుకుంటూ నిరుత్సాహ పడవద్దు. అలాంటి వారికి నేను చెప్పేదొకటే, మీ ముందు 40 ఏళ్లపాటు పనిచేయాల్సిన జీవితం ఉంది. అలాంటప్పుడు ఉద్యోగం కోసం ఎందుకు తొందరపడతారు. నిరుత్సాహపడకుండా నిరీక్షించండి!

2. ఇంటర్వ్యూలో పోతే కంగారు పడొద్దు....
ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్లడం, యాజమాన్యం తిరస్కరించడం. ఆల్‌ ఇన్‌ ది గేమ్‌. మూడు, నాలుగు ఇంటర్వ్యూలో మంచిగా రాణించకపోయినా, తిరస్కరణకు గురైనా కంగారు పడొద్దు. మరో ఇంటర్వ్యూ కోసం శక్తివంచన లేకుండా కషి చేస్తూ వెళ్లాలి. మనం ఎంపిక కావాల్సిన ఇంటర్వ్యూ మన కోసం ఎక్కడో నిరీక్షిస్తూనే ఉంటుంది.

3. ఉద్యోగం మీద కాదు, ఇడస్ట్రీ మీద దృష్టి పెట్టాలి...
కొత్త వారకి  తాము కలలుగంటున్న ఉద్యోగం, దానికి ఆశించిన స్థాయి వేతనం దొరకడం అంత ఈజీ కాదు. అందుకని చేయాల్సిన ఉద్యోగం కోసం కన్నా ఫలానా పరిశ్రమలోకి ప్రవేశించడం ఎలా అన్న అంశంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. ఓ కంపెనీలోకి ప్రవేశించడం కోసం దిగువస్థాయి ఉద్యోగమైన అంగీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత టాలెంట్‌ను నిరూపించుకోవడం ద్వారా పైస్థాయికి ఎదగవచ్చు.

4. తొలి దృష్టి డబ్బుపై ఉండకూడదు....
అమెరికా లాంటి విదేశాల్లో అధిక ఫీజులు చెల్లించి చదువుకున్న వారు త్వరగా ఉద్యోగంలో చేరిపోవాలని చూస్తారు. రావాల్సిన అవకాశాలను వెతుక్కోకుండా  అవసరార్థం బార్‌టెండింగ్, గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్లలో చేరిపోతారు. దాని వల్ల మంచి అవకాశాలను వెతుక్కోవడంలో జాప్యం జరగవచ్చు. అత్యవసరంగా డబ్బులున్నవారు వీకెండ్‌ ఉద్యోగాలు చేయవచ్చుగానీ అసలు దృష్టి మాత్రం అర్హతలకు తగిన ఉద్యోగాలపై ఉండాలి.

5. అవసరమైన రీసెర్చ్‌....
ఇంటర్యూలకు హాజరవుతున్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది సరైన హోం వర్క్‌ లేకుండానే వస్తున్నారు. అంటే తాము ఇంటర్వ్యూకు హాజరవుతున్న కంపెనీ గురించి, ఆ కంపెనీ ఉత్పత్తుల గురించి. ఆ కంపెనీ క్లైంట్ల గురించి, మార్కెటింగ్‌ గురించి ఏం తెలుసుకోకుండా వస్తున్నారు. అభ్యర్థులు వీటన్నింటి గురించి తెలసుకోవడంతోపాటు కంపెనీ ఇచ్చే పత్రికా ప్రకటనల గురించి కూడా తెలసుకొని రావాలి.

6. జీతభత్యాల గురించి అడగొద్దు!
కొంత మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు రాగానే జీతభత్యాల గురించి, కంపెనీ నుంచి వచ్చే ఇతర బెనిఫిట్ల గురించి వెంటనే అడుగుతారు. దానివల్ల తప్పుడు సందేశం వెళుతుంది. అన్నింటికన్నా ఉద్యోగమే పరమావధిగా చెప్పుకోవాలి. కొంతమేరకు సెలక్షన్‌ అయిపోతేనే కంపెనీయే జీతభత్యాల ప్రస్థావన తీసుకొస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి.

7. ఆత్మవిశ్వాసం ముఖ్యం
ఆ ఉద్యోగం తనకే వస్తదన్న ఆత్మవిశ్వాసంతో ఉండాలి. సానుకూల దక్ఫథంతో ప్రవర్తించాలి. ఆ ఉద్యోగం తనకే వస్తుందన్న గౌరవంగానీ, గడసరితనంగానీ చూపరాదు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు మీతో కరచాలనం చేస్తున్నప్పుడు మీ కళ్లలోకి సూటిగా చూస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పసిగట్టడం కోసమే అలా చూస్తారు.

8. మీరు ఇంటర్వ్యూ దశకు వచ్చారంటే...
మీరు ఇంటర్వ్యూ దశకు వచ్చారంటేనే కంపెనీకి మీరే సరైన వ్యక్తని, మీకు ఉద్యోగం ఇవ్వడం కోసమే ఇంటర్వ్యూచేసే వ్యక్తి వచ్చారని అర్థం చేసుకోవాలి. మీకే ఉద్యోగం వస్తుందన్న విశ్వాసంతో ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. తెలియని ప్రశ్నలుంటే నిజాయితీగా అందుకు నిజాయితీగానే చెప్పాలి. అవసరమైతే మరిన్ని వివరాలు కోరాలి. నీతోపాటు ఇంటర్వ్యూలకు వచ్చిన ఇతర అభ్యర్థుల అర్హతలను చూసి ఆందోళన చెందవద్దు. ఉద్యోగం నీవు ఎలా చేయగలవో సూటిగా చెబితే చాలు.

9. మాట సాయం తీసుకోవచ్చు....
ఓ కంపెనీకి రోజు ఐదు నుంచి పది రిస్యూమ్స్‌ రావచ్చు. ప్రతి రోజు వాటిని క్షుణ్నంగా పరిశీలించి చూసే అవకాశం యాజమాన్యంకు ఉండదు. కనుక తెల్సిన వారి మాట సాయం తీసుకోవచ్చు. కంపెనీలో ఎవరైనా తెల్సింటే వారి మాట మీద రిస్యూమ్‌లను పరిశీలించే అవకాశం, ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.


10. ఉద్యోగం పట్ల అభిరుచిని చూపాలి.
ఆ ఉద్యోగం చేయడం తన అభిరుచిగా చెప్పుకోవాలి. అందుకు కారణాలుంటే వివరించాలి. ఇంటర్వ్యూకు రావడమే ఓ థ్రిల్లింగ్‌ ఉందన్నట్లు ప్రవర్తించాలి. ఉద్యోగం వచ్చినా, రాకపోయినా ఇంటర్వ్యూకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపాలి. లిఖితపూర్వకంగా తెలియజేయడం మంచిది.

మరిన్ని వార్తలు