పరోటా పంచాయితీపై ఆనంద్‌ మహింద్రా ట్వీట్‌

12 Jun, 2020 18:11 IST|Sakshi

న్యూఢిల్లీ: పరోటా, రోటీ పంచాయితీపై మహింద్రా అండ్‌ మహింద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా స్పందించారు. దేశం ముందు కొత్తగా పరోటా సవాల్‌ వచ్చి చేరిందని ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  కాగా, రోటీ కోవాకు చెందిన పరోటాపై 18 శాతం జీఎస్టీ తప్పదని అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్స్‌-కర్ణాటక బెంచ్‌ (ఏఏఆర్‌) తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. రోటీ కేటగిరీలో పరోటాను చేర్చలేమని స్పష్టం చేసింది. ఇక ఏఏఆర్‌ ప్రకటనతో పరోటా ఉనికికే ప్రమాదం వచ్చిందని ఆనంద్‌ మహింద్రా వ్యాఖ్యానించారు. రోటీ వర్గం నుంచి పరోటాను వేరుచేయడం బాధించిందని అన్నారు. అయితే, భారత్‌లో కొత్తగా ‘పరోటీస్‌’ అనే వెరైటీ కూడా పుట్టుకొస్తుంది కావొచ్చని పేర్కొన్నారు.

విషయమిది..
బెంగుళూరుకు చెందిన ఐడీ ఫ్రెష్‌ ఫుడ్స్‌సంస్థ ఇటీవల అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్స్‌ (కర్ణాటక బెంచ్‌)ను ఆశ్రయించింది. రోటీ కేటగిరికి చెందిన పరోటాపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారని, దాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. రోటీపై 5 శాతం జీఎస్టీ విధిస్తుండగా.. పరోటాపై 18 శాతం పన్ను వసూలు చేస్తున్నారని పేర్కొంది. జీఎస్టీ కేటగిరి 1905 లోనే పరోటాను కూడా చేర్చాలని కోరింది. అయితే, పరోటా, రోటీ తయారీలో తేడాలున్నాయని, 1905 కేటగిరీలో పరోటాను చేర్చలేమని ఏఏఆర్‌ వెల్లడించింది. 2106 కేటగిరీ ప్రకారం పరోటాపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నామని తెలిపింది. ఇక పరోటాపై అధిక పన్నులు తగవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రుచికరమైన పరోటాపై పగబట్టారని సోషల్‌ మీడియాలో మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. దీంతో ట్విటర్‌లో హ్యాండ్సాఫ్‌ పరోటా హాష్‌టాగ్‌ ట్రెడింగ్‌లో ఉంది.

మరిన్ని వార్తలు