మురికివాడల మహా‘భారత్’.. రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్

25 Dec, 2013 02:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశం అభివృద్ధి చెందుతోందంటూ మన పాలకులు చేస్తున్న ప్రకటనలు ఉత్తుత్తివేనని.. వారి మాటల్లో ఏమాత్రమూ పసలేదని.. మురికివాడలపై జాతీయ నమూనా సర్వే కార్యాలయం(ఎన్‌ఎస్‌ఎస్‌వో) జరిపిన సర్వే కుండబద్దలుకొట్టి మరీ చాటుతోంది! దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 33,510 మురికివాడలున్నాయని, వీటిలో 41 శాతం గుర్తించినవికాగా, మిగిలినవి అనధికారకమైనవని, అక్కడి ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని సర్వే చెప్పింది.

సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ మంగళవారం ఇక్కడ వెల్లడించింది. 2012 జూలై నుంచి డిసెంబర్ మధ్య కాలంలో నిర్వహించిన సర్వేలో మురికివాడల సంఖ్యాపరంగా మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం, పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 4539 మురికివాడలుండగా వీటిలో నోటిఫైడ్‌వి 3224 కాగా, నోటిఫైడ్ కానివి 1315. దేశవ్యాప్తంగా 88 లక్షలకుపైగా కుటుంబాలు మురికివాడల్లోనే జీవనం సాగిస్తున్నాయని సర్వే పేర్కొంది. దేశం మొత్తమ్మీద 44 శాతం మురికివాడలు ప్రైవేట్ భూముల్లోనే ఉన్నాయంది.  
 

మరిన్ని వార్తలు