ఐఐటీ-బీ హాస్టళ్లలో కోతుల బీభత్సం

14 Sep, 2016 14:35 IST|Sakshi
ఐఐటీ-బీ హాస్టళ్లలో కోతుల బీభత్సం

ముంబై: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బొంబాయి(ఐఐటీ-బీ) విద్యార్ధులు ఇప్పుడు చదువుకు భయపడటం లేదు. రోజూ తమ హస్టళ్లపై దాడి చేసి విధ్వసం సృష్టిస్తున్న కోతులను చూస్తే బెంబేలెత్తిపోతున్నారు. క్యాంపస్ లోని నాలుగు హస్టళ్ల పరిస్థితి అయోమయంగా ఉంది. తలుపు తీస్తే ఎప్పుడు ఏ కోతి గదిలోకి వచ్చి దాడి చేస్తుందో తెలీక విద్యార్ధులు బిక్కుబిక్కుమంటున్నారు.

విద్యార్థుల చేతుల్లోని తినుబండారాలను లాక్కోవడమే కాకుండా, తాళం వేయని గదుల్లోకి ప్రవేశించి ఎలక్ట్రానిక్ వస్తువులను నాశనం చేస్తున్నాయి. అక్కడితో ఆగకుండా గదిలోని మంచాలపై పడుకుని నిద్రపోతున్నాయి. దాదాపు 10 నుంచి 15కోతులు ఎప్పటినుంచో క్యాంపస్ లో ఉంటున్నాయి. వాటి వల్ల చాలా మంది విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చివరి సంవత్సర విద్యార్ధి ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను క్యాంపస్ మేగజీన్ లో విద్యార్ధులు ప్రచురించారు.

దీంతో విద్యార్ధులు హాస్టళ్లకు నడిచివెళ్లేటప్పుడు చేతిలో చిన్న కర్రను ఉంచుకోవాలని, హాస్టల్ ప్రాంగణంలో టపాకాయలు కాల్చుతుండాలని క్యాంపస్ కోరింది.
క్యాంపస్ అడవికి దగ్గరగా ఉండటం వల్లే కోతుల బెడద ఎక్కువగా ఉందని ఓ ప్రొఫెసర్ అన్నారు. తరచూ క్యాంపస్ లో గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటాయని పేర్కొన్నారు. కేవలం హాస్టళ్ల మీదే కాక, గతంలో ఆఫీసుల మీద కూడా కోతులు దాడి చేసిన ఘటనలు ఉన్నాయని వివరించారు. జంతురక్షణ సంస్థలు తరచూ కోతులను సురక్షిత ప్రాంతాలకు పంపుతున్నా అవి మళ్లీ మళ్లీ తిరగి వస్తూనే ఉన్నాయని విద్యార్ధుల డీన్ తెలిపారు. విద్యార్ధులు వారి వస్తువులను జాగ్రత్త చూసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు