ఒక్క సిమెంట్‌ బస్తా ధర రూ.8000

18 Nov, 2017 13:35 IST|Sakshi

ఇటానగర్‌ : సాధారణంగా ఒక సిమెంట్‌ బస్తా ధర ఎంత ఉంటుంది? గరిష్టంగా ఓ రూ.330 వరకు పలుకవచ్చు. కానీ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని విజోయ్‌నగర్‌లో మాత్రం ఒక్క సిమెంట్‌ బస్తా ధర 8వేల రూపాయలు. అదీ కూడా దొరికితేనే. ఛంగ్‌లంగ్‌ జిల్లాలోని సబ్‌ డివిజనల్‌ పట్టణం అయిన విజోయ్‌నగర్‌లో మొత్తం 1500 మంది వరకు నివసిస్తున్నారు. కానీ ఆ ప్రాంత వాసులకు బయట ప్రాంతాల వారితో సంబంధాలు ఉండవు. అక్కడి నుంచి సమీపంలోని మరో పట్టణానికి వెళ్లాలంటే ఐదు రోజుల పాటు నడవాల్సిందే. 

అలాంటి ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి కార్యక్రమం అధికారులకు సవాళ్లలాగానే నిలుస్తోంది. విజోయ్‌నగర్‌కు సరఫరా చేసే ఒక్కో సిమెంట్‌ బస్తాకు రూ.8వేలు, డబ్ల్యూసీ ప్యాన్‌కు రూ.2వేలు చెల్లించాల్సి వస్తుందని పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ జూనియర్‌ ఇంజనీర్‌ జుమ్లి అడో చెప్పారు. ఈ పట్టణంలో ప్రతిఒక్క ఇంటికి ఓ మరుగుదొడ్డి నిర్మించే కార్యక్రమాన్ని పీహెచ్‌ఈ డిపార్ట్‌మెంట్‌ చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం ఒక్కో ఇంటి మరుగుదొడ్డికి కేంద్రం నుంచి రూ.10,800, రాష్ట్రం నుంచి రూ.9,200 ఫండ్లు జారీ అయ్యాయి.

విజోయ్‌నగర్‌కు రవాణా చేసే అన్ని మెటీరియల్స్‌ను, భారత్‌- చెన్నై- మయన్మార్‌ ట్రై-జంక్షన్‌ నుంచి నాండఫా నేషనల్‌ పార్క్‌ ద్వారా చక్మాస్‌ సరఫరా చేస్తున్నారు. దీంతో రూ.150 కేజీల ఒక్కో సిమెంట్‌ బస్తాకు రూ.8000 వరకు చెల్లించాల్సి వస్తుందని అడో తెలిపారు. భుజాలపై మోసుకుంటూ 156 కిలీమీటర్ల మేర ఐదు రోజలు పాటు నడుస్తూ తమ గ్రామానికి ఈ సిమెంట్‌ బస్తాలను చేరవేస్తున్నారని పేర్కొన్నారు. కొండ ప్రాంత ప్రజలు ఏ మేర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలియజేయడానికి ఇదే నిదర్శనమని అడో పేర్కొన్నారు. ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ, స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌-గ్రామిన్‌ అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కటి ఇంటికి మరుగుదొడ్డి చాలా త్వరగా పూర్తిచేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతానికి రోడ్డు నిర్మాణ ప్రాజెక్టును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. 

మరిన్ని వార్తలు