రాజస్ధాన్‌ హైడ్రామా : ముగిసిన సీఎల్పీ భేటీ

13 Jul, 2020 16:03 IST|Sakshi

పైలట్‌తో మంత్రాంగం ఫలించేనా!

జైపూర్‌ : రాజస్ధాన్‌ ముఖ్యమం‍త్రి అశోక్‌ గహ్లోత్‌ సర్కార్‌పై ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ తిరుగుబాటుతో చెలరేగిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అశోక్‌ గహ్లోత్‌ తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు లోనవకుండా కాపాడుకుంటున్నారు. రాజీ ఫార్ములాతో మెత్తబడిన సచిన్‌ పైలట్‌ ముఖ్యమంత్రి గహ్లోత్‌కు ఎంతవరకూ సహకరిస్తారనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు గహ్లోత్‌ నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశం (సీఎల్పీ) ముగిసింది. ముఖ్యమంత్రి గహ్లోత్‌కు మద్దతు ప్రకటిస్తూ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. భేటీ అనంతరం ఆయనకు మద్దతు పలికిన ఎమ్మెల్యేలను బస్సుల్లో రిసార్ట్‌కు తరలించారు. ఈ సమావేశంలో పాల్గొని బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు అంతా సజావుగా ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. 102 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారని గహ్లోత్‌ వర్గీయులు చెబుతున్నారు. చదవండి : ప్రియాంక రాయబారం : మెత్తబడిన పైలట్‌

మరోవైపు తనకు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించిన సచిన్‌ పైలట్‌తో ఢిల్లీలో పార్టీ హైకమాండ్‌ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పైలట్‌ మూడు ప్రధాన డిమాండ్లను అధిష్టానం ముందుంచారు. తన వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వాలని, కీలక హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను కేటాయించాలని, పీసీసీ చీఫ్‌గా తనను కొనసాగించాలని ఆయన పట్టుబట్టారు. మరోవైపు ప్రియాంక గాంధీ చొరవతో సచిన్‌ పైలట్‌తో హైకమాండ్‌ జరిపిన మంతనాలతో అసంతృప్త నేత మెత్తబడ్డారని పార్టీ వర్గాలు పేర్కొన్నారు. పార్టీతో అన్ని విషయాలను చర్చించిన మీదట సచిన్‌ పైలట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. కాగా, 200 మంది సభ్యులున్న రాజస్తాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. అయితే, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో రెబెల్‌ నేత సచిన్‌ పైలట్‌ గహ్లోత్‌కు సహకరిస్తారా..లేక బీజేపీ గూటికి చేరతారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా