Rajasthan: ఆ మూడు రాష్ట్రాల్లో సీఎం లేదా డిప్యూటీ సీఎంలుగా మహిళలు?

7 Dec, 2023 07:58 IST|Sakshi

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి సహకారమందించిన మహిళలకు బీజేపీ మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోందని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాలతో  జరిగిన సమావేశంలో ఈ మూడు రాష్ట్రాల్లో మహిళలకు  సీఎం లేదా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించారు. 

మూడు రాష్ట్రాల్లోనూ కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకుని మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కరు చొప్పున డిప్యూటీ సీఎం పదవులు మహిళలకు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి మూడు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. ఈ నేపధ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలకు మరింతగా రాజకీయ సాధికారత కల్పించేందుకు పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకుంది. 

మూడు రాష్ట్రాల్లోనూ డిప్యూటీ సీఎంలుగా మహిళలను నియమించడం ఖాయమని పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ జనాభా పరంగా పెద్ద రాష్ట్రం కావడం, పలువురు సీనియర్‌ నేతలు ఈ ఎన్నికల్లో గెలుపొందిన కారణంగా ఇక్కడ ఇద్దరు మహిళలను డిప్యూటీ సీఎంలుగా నియమించే అవకాశం ఉందంటున్నారు. ఇంతేకాకుండా ఈ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్పీకర్లుగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.

మధ్యప్రదేశ్‌లో ఓబీసీ, ఛత్తీస్‌గఢ్‌లో ఎస్టీ, రాజస్థాన్‌లో రాజకుటుంబానికి చెందిన వ్యక్తికి సీఎం పదవి దక్కడం ఖాయమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌ స్పీకర్‌గా నరేంద్ర సింగ్‌ తోమర్‌ను, రాజస్థాన్‌లో కిరోరీ లాల్‌ మీనాను స్పీకర్‌గా  ఎంపిక చేయాలనే అంశంపై చర్చ సాగుతోంది. 
ఇది కూడా చదవండి: సీఎం ఎంపికపై మల్లగుల్లాలు.. ఢిల్లీకి వసుంధర రాజే!

>
మరిన్ని వార్తలు