జాట్ల ఆందోళనతో 20 వేల కోట్లు నష్టం

21 Feb, 2016 17:03 IST|Sakshi

న్యూ ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న జాట్ల ఆందోళనల మూలంగా హర్యానా రాష్ట్రానికి 20,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు పారిశ్రామిక సంస్థ అసోచామ్ తన నివేదికలో వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు రాష్ట్రంలో స్తంభించిపోయిన పారిశ్రామిక ఉత్పత్తుల మూలంగా ఈ నష్టం వాటిల్లినట్లు అసోచామ్ తెలిపింది.

జాట్ల ఉద్యమం హర్యానాతో పాటు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లపై కూడా ఆర్ధికంగా ప్రభావం చూపుతోందని ఈ నివేదిక తెలిపింది. పలు ముఖ్యమైన జాతీయ రహదారులు హర్యానా రాష్ట్రం గుండా వెళ్తుండటంతో ఆ ప్రాంతంలోని రవాణా అనుబంధ రంగాలు తీవ్రంగా ప్రభావితం అయినట్లు వెల్లడించింది. ఆదివారం కూడా హర్యానాలో జాట్ల ఆందోళన కొనసాగుతోంది. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.
 

మరిన్ని వార్తలు