తదుపరి ప్రధానిపై రాందేవ్‌ బాబా కీలక వ్యాఖ్యలు

26 Dec, 2018 12:43 IST|Sakshi

మధురై : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో యోగ గురు రాందేవ్‌ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో పాలక బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని గట్టిగా సమర్ధించిన రాందేవ్‌ బాబా స్వరం మారింది. తదుపరి ప్రధాని ఎవరో చెప్పడం కష్టమని, దేశానికి ఎవరు నాయకత్వం వహిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవ ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు ఎదురైన నేపథ్యంలో రాందేవ్‌ బాబా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికిన రాందేవ్‌ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ వ్యక్తికీ, పార్టీకి మద్దతు ప్రకటించడం, వ్యతిరేకించడం చేయనని ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. రాజకీయాలపై తాను దృష్టిసారించడం​లేదన్నారు. తమకు ఎలాంటి రాజకీయ, మతపరమైన అజెండా లేదని, అయితే తాము యోగ, వేద పద్ధతుల ద్వారా ఆథ్యాత్మిక దేశం, ఆథ్యాత్మిక ప్రపంచాన్ని కోరుతామన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా క్రియాశీలకంగా పనిచేసిన రాందేవ్‌ బాబాను బీజేపీ పాలిత హర్యానాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించి అనంతరం కేబినెట్‌ హోదా కల్పించారు.

మరిన్ని వార్తలు