క్యాబ్‌ బుక్‌ చేసిన మహిళకు చేదు అనుభవం

18 Oct, 2019 08:42 IST|Sakshi
అనుచితంగా ప్రవర్తించిన డ్రైవర్‌(ఫొటో కర్టెసీ: ఇండియా టుడే)

బెంగళూరు : గమ్యస్థానాలకు చేరుకునేందుకు క్యాబ్‌, బైక్‌ ట్యాక్సీలను ఆశ్రయిస్తున్న మహిళలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డ్రైవర్‌ అనుచిత, అసభ్య ప్రవర్తనతో ప్రతిరోజూ ఎంతో మంది మహిళలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన గౌరీ ధావన్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వివరాలు... తన నివాసం నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు గౌరీ గురువారం ఓలా క్యాబ్‌ను బుక్‌ చేశారు. ఉదయం పదకొండు సమయంలో తనను రిసీవ్ చేసుకోవాల్సిందిగా సంబంధిత డ్రైవర్‌కు తెలిపారు. ఈ క్రమంలో పీన్యాలో ఉన్న గౌరీ ఇంటికి చేరుకున్న క్యాబ్ డ్రైవర్‌ ఆమెను కిందకి రమ్మని చెప్పాడు. దీంతో లగేజ్‌తో సహా అక్కడికి చేరుకున్న గౌరీతో.. తనకు ఆన్‌లైన్‌ పేమెంట్‌ వద్దని.. చేతికి డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఇందుకు తొలుత ఆమె నిరాకరించినప్పటికీ సరైన సమయానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాలనే ఉద్దేశంతో డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకొన్నారు. (చదవండి : బైక్‌ టాక్సీ బుక్‌చేసిన యువతితో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన)

ఈ నేపథ్యంలో కొంత దూరం వెళ్లిన తర్వాత ఆన్‌లైన్‌ వివరాల ప్రకారం రూ. 650 ఇచ్చేందుకు సిద్ధమవగా... తనకు ఆ డబ్బు సరిపోదని.. ఎక్కువ మొత్తం కావాలని డ్రైవర్‌ డిమాండ్ చేయడంతో ఆమె షాకయ్యారు. వెంటనే తేరుకుని చెప్పిన దాని కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వనని తేల్చిచెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో కారును నిలిపివేసిన డ్రైవర్‌ గౌరీ లగేజ్‌ను ఒక్కొక్కటిగా కింద పారేయడం మొదలుపెట్టాడు. తర్వాత గౌరీపై భౌతికంగా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన గౌరీ పోలీసులకు ఫోన్‌ చేయడంతో ఆమెను అక్కడే దింపేసి పారిపోయాడు. ఈ విషయం గురించి గౌరీ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ...‘ నేను ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ బుక్ చేశాను. అయితే సదరు క్యాబ్‌ డ్రైవర్‌ అనుచితంగా ప్రవర్తించాడు. ఎక్కువ డబ్బు చెల్లించాలంటూ గొడవపడ్డాడు. క్యాబ్‌ ఎక్కినప్పటి నుంచి బెదిరించడం మొదలుపెట్టాడు. నాపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ప్రతిఘటించాను. కానీ అతడు ఏమాత్రం బెదరలేదు. నా లగేజ్‌ బయట పారేసి.. మర్యాదగా క్యాబ్‌ దిగుతావా లేదా ఈడ్చిపడేయమంటావా అంటూ భయపెట్టాడు. ఓలా గైడ్‌లైన్స్‌ అన్నింటినీ ఉల్లంఘించాడు’ అని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై సదరు మీడియా ఓలా పీఆర్‌ టీంను సంప్రదించగా వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదని తెలిపింది.

>
మరిన్ని వార్తలు