భగవాన్‌ టీచరంటే ఎందుకంత ప్రేమ?

23 Jun, 2018 14:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు తిరువల్లూర్‌లోని వెలైగారం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు టీచర్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల భగవాన్‌ బదిలీపై మరో పాఠశాలకు వెళ్లడాన్ని తట్టుకోలేని ఆ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, ఆయన్ని వెళ్లద్దంటూ ఏడుస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో తీవ్రంగా హల్‌చల్‌ చేస్తున్న విషయం తెల్సిందే. దీనిపై ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్,  నటుడు హృతిక్‌ రోషన్‌లు, కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిల్‌ స్వరూప్‌లు కూడా తమదైన శైలిలో స్పందించారు. 

ఇలాంటి ‘గురుశిష్యుల’ అనుబంధం తానెక్కడా చూడల్లేదంటూ రెహమాన్‌ వ్యాఖ్యానించగా, వీరి అనుబంధం తన హృదయాన్ని ఎంతో హత్తుకుందని హృతిక్‌ రోషన్‌ వ్యాఖ్యానించారు. భగవాన్‌ లాంటి ఉపాధ్యాయులు తమకు ఎంతో మంది అవసరం  అంటూ కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిల్‌ వ్యాఖ్యానించారు. తాను ఇంతగా విద్యార్థినీ విద్యార్థులతో ఎలా అనుబంధాన్ని పెంచుకున్నారో భగవాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖంగా విన్నవించారు.

‘నేను విద్యార్థులతో ఓ అనుబంధాన్ని ఏర్పరుచుకోవడంలో భాగంగా వారికి ఆసక్తికరమైన కథలను చెప్పేవాడిని. పాఠాలను కూడా అదే తరహాలో బోధించేందుకు ప్రయత్నించేవాడిని. వారి వారి కుటుంబాల నేపథ్యం గురించి విచారించే వాడిని. వారి భవిష్యత్‌ ప్రణాళికల గురించి గుచ్చి గుచ్చి అడిగి తెలుసుకునేవాడిని. వారి కుటుంబ నేపథ్యాలు, వారి భవిష్యత్తు కలలను దృష్టిలో పెట్టుకొని వారు భవిష్యత్తులో ఎంచుకోవాల్సిన మార్గాల గురించి సూచించే వాడిని’ అని చెప్పారు. 

భగవాన్‌ ఉదంతాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్న రెండు ప్రధాన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భగవాన్‌ ఇంగ్లీషు టీచరు. అయినప్పటికీ ఆయన తప్పులు లేకుండా ఇంగ్లీషును మాట్లాడలేక పోతున్నారు. ఆయన సాదాసీదా అందరికి తెలిసిన సాధారణ పదాల్లోనే తన అభిప్రాయాలను చెబుతూ వచ్చారు. వాటిలోనూ వ్యాకరణ దోషాలు కనిపించాయి. ఆయన కూడా చదువుకున్నది ప్రస్తుత ప్రభుత్వ విద్యా విధానంలోనే కావడం వల్ల ఆయనకు కూడా భాష అంతగా అబ్బినట్లు లేదు. ఇది ప్రభుత్వ విద్యావిధానంలో ఉన్న ప్రధాన లోపాల్లో ఒకటి. ఇక రెండో లోపం కూడా విద్యార్థులతో ఆయన పెనవేసుకున్న బంధమే సూచిస్తోంది. 

ఏ ఉపాధ్యాయుడికైనా విద్యార్థులతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నప్పుడే విద్యారంగంలో గురుశిష్యులు రాణించగలరు. ఇలాంటి బంధాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విద్యా విధానాలు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం విద్యారంగాన్ని కూడా అన్ని ప్రభుత్వ విభాగాల్లాగే చూస్తోంది. ఉపాధ్యాయులను ఇతర విభాగాల గుమాస్తాలుగా పరిగణిస్తోంది. ఆ ధోరణి మారాలి. అవసరమైతే బదిలీ నిబంధనల్లో మార్పులు తీసుకరావాలి. వెలైగారంలో భగవాన్‌ టీచర్‌ బదిలీని ఆపాల్సిందిగా గ్రామస్థులు కూడా కోరగా అది తన చేతిలో లేదంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చేతులెత్తేశారు.

నచ్చిన టీచర్‌ను కాకుండా ఉత్తమ టీచరును రిటేన్‌ చేసుకునే అధికారం ప్రధానోపాధ్యాయుడికి ఉండాలి. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే కనుక సామాజిక శాస్త్రంలో వారికి సరైన శిక్షణ ఉండాలి. విద్యార్థులకు  కూడా చిన్పప్పటి నుంచే సమాజాన్ని అర్థం చేసుకునే పాఠ్యాంశాలు ఉండాలి. ఎందుకంటే భగవన్‌ను, విద్యార్థుల మధ్య బంధాన్ని పెంచిందీ ఈ అంశాలే. 

భగవాన్‌కు సంబంధించిన వీడియో వైరల్‌ కాగానే కొంత మంది సినీ నిర్మాతలు ఆయనపై సినిమా తీసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. గురుశిష్యుల అనుబంధం గురించి చెప్పి నాలుగు డబ్బులు వెనకేసుకునే విధంగా ఆయనపై సినిమా ఉండకూడదు. ఆయన విద్యార్థులతో ఎందుకు అలాంటి అనుబంధాన్ని ఏర్పరుచుకోవాల్సి వచ్చిందో వివరణ ఉండాలి. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే విధంగానూ సినిమా ఉండాలి. 

మరిన్ని వార్తలు