అక్కడ కుక్కలు, గుర్రాల పేరుతో భూములు!

26 Nov, 2019 20:41 IST|Sakshi

పణజి: బిహార్‌లో రెవెన్యూ రికార్డులు సరిగా లేదని గోవా గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్ వాఖ్యానించారు. మంగళవారం 70వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గోవా విశ్వవిద్యాలయం మైదాన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జమీందారీ నిర్మూలన చట్టం అమలు బిహార్‌లో సమర్థవంతంగా జరగలేదని పేర్కొన్నారు. మాలిక్ 2017-18 మధ్య కాలంలో బిహార్‌ గవర్నర్‌గా సేవలందించారు. బిహార్‌లో కుక్కలు, గుర్రాలు, కర్రల పేరుతో కూడా సొంత భూములు ఉన్నాయని తెలిపారు. జమీందారీ నిర్మూలన చట్టం ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే సమర్థవంతంగా అమలులో ఉందని పేర్కొన్నారు.

తాను బిహార్ గవర్నర్‌గా పనిచేసిన కాలంలో.. రెవెన్యూ రికార్డులు సరిగా లేవని, అక్కడ కుక్కలు, గుర్రాలు, కర్రల పేరిట భూమి నమోదు చేయడాన్ని చూసి షాక్‌కు లోనయ్యానని చెప్పారు. జమీందారీ చట్టంలోని లోపాల వల్లే.. ఇప్పుడు అక్కడ కొంతమంది భూస్వాముల పేరిట 4,000-5,000 వరకు భిగా భూములు ఉన్నాయని వెల్లడించారు. జమీందారీ నిర్మూలన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసిన యూపీ మాజీ ముఖ్యమంత్రి చౌదరి చరణ్ సింగ్‌ను ఈ సందర్భంగా మాలిక్ కొనియాడారు. బిహార్‌ నుంచి జమ్మూకశ్మీర్‌కు గవర్నర్‌గా వెళ్లిన సత్యపాల్‌ మాలిక్‌.. ఇటీవల ఆర్టికల్‌ 370 రద్దు తరువాత ఈ నెలలో (నవంబర్‌) గోవాకు బదిలీ అయ్యారు.

మరిన్ని వార్తలు