బిహార్ అసెంబ్లీ మూడో విడత పోలింగ్ ప్రారంభం

28 Oct, 2015 08:19 IST|Sakshi
బిహార్ అసెంబ్లీ మూడో విడత పోలింగ్ ప్రారంభం

50 స్థానాల్లో పోలింగ్; బరిలో లాలూ ఇద్దరు కొడుకులు
పట్నా: బిహార్ అసెంబ్లీ మూడో దశ ఎన్నికల్లో భాగంగా నేడు 50 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. పట్నా, వైశాలి, సరన్, నలంద, బక్సర్, భోజ్‌పూర్ జిల్లాల్లో విస్తరించిన ఈ 50 స్థానాల్లో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ ఇద్దరు కొడుకులు తేజ్‌ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ పోటీ చేస్తున్న మహువా, రాఘోపూర్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. లాలూకు గట్టి పట్టున్న సరన్‌లోని 10 స్థానాలు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సొంత జిల్లా నలందలోని 7 స్థానాల్లోనూ బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ దశలో మొత్తం 1.45 కోట్ల మంది ఓటర్లు 808 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారని అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లక్ష్మణన్ వెల్లడించారు. అయితే, నితీష్ సొంత జిల్లా, లాలు ఇద్దరు కుమారులు పోటీ చేస్తున్న స్థానాల్లో పోలింగ్ జరుగుతుండటంతో ఈ విడత ఎన్నికలు మహాకూటమికి కీలకం కానున్నాయి. తొలి, రెండో విడతల పోలింగ్లలో 81 స్థానాలకు ఎన్నికలు నిర్వహించిన విషయం విదితమే. నవంబర్ 1, నవంబర్ 5 తేదీలలో నాల్గో, ఐదో విడతల పోలింగ్ నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు