కోటీశ్వరులూ వలస పక్షులే!

17 Jun, 2018 02:32 IST|Sakshi

ఉన్న ఊరిని వదిలి వెళ్లాలని ఎవరికి ఉంటుంది? బతికేందుకు దారి లేకపోతేనో.. సంపాదన సరిపోకపోతేనో.. దేశం కాని దేశానికి వలస వెళ్లడం తప్పదు.. కానీ అప్పటికే కోట్ల రూపాయల సంపద ఉన్నా మరింత సంపాదన కోసం వెళ్లే ‘వలస’లూ పెరిగిపోతున్నాయి.. లాభాలు చాల్లేదనో, పెట్టుబడికి రెట్టింపు ఆదాయం లభిస్తుందనో, పన్నులు కట్టనక్కర్లేదనో, వ్యాపారాలకు రాయితీలున్నాయనో.. ఇలా కారణాలేమైతేనేం.. పైసా ఎక్కువొస్తే చాలంటూ పరాయి దేశానికి పరుగులు తీస్తున్న కోటీశ్వరుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందని ఆఫ్రో ఆసియా బ్యాంకు అధ్యయనం చెబుతోంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ బ్యాంకు కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరుల వలసలపై అధ్యయనం చేస్తోంది. వివిధ దేశాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు, బోలెడంత డబ్బున్న వారికి ప్రయాణ ఏర్పాట్లు, ఇతర విలాసాలను అందించే వారి నుంచి వివరాలు సేకరించి ఏటా ‘గ్లోబల్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రివ్యూ’ పేరుతో నివేదికను విడుదల చేస్తోంది. 

‘వలస’సంపన్నుల్లో రెండో స్థానం మనదే.. 
- స్వదేశాల నుంచి ఇతర దేశాలకు వలసవెళుతున్న సంపన్నుల సంఖ్యలో మనదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అత్యధికులు ఆస్ట్రేలియాకు వలస వెళుతుండగా.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అరబ్‌ దేశాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 
గతేడాది మన దేశం నుంచి వలస వెళ్లిన కోటీశ్వరుల సంఖ్య 7 వేలు. 
2016లో విదేశీ బాట పట్టిన వారి సంఖ్య 9,500 
2014 నుంచి ఇప్పటివరకూ మొత్తం 23 వేల మంది కోటీశ్వరులు భారత్‌ను వదిలి వెళ్లారు. వీరిలో అధికులు బ్రిటన్, దుబాయ్, సింగపూర్‌లలో శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్నారు. 
ప్రపంచ సంపదపై తయారు చేసిన తాజా నివేదిక ప్రకారం భారత దేశంలో 2,45,000 మంది కోటీశ్వరులు ఉండగా.. 2022కల్లా ఈ సంఖ్య 3,72,000కు చేరనుంది. దేశంలోని కోటీశ్వరుల్లో 2.1 శాతం మంది ఇప్పటికే వలసబాట పట్టారు. ఇది చైనా కంటే ఎక్కువ. 
2016లో ప్రపంచంలోని మొత్తం సంపద 192 లక్షల కోట్ల డాలర్లు కాగా.. 2017 చివరికల్లా 12 శాతం పెరిగి 215 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రపంచంలోని మిలియనీర్లలో రెండు శాతం మంది భారతదేశంలోనే ఉన్నారు. బిలియనీర్లలో మన వాటా 5 శాతం. 
ప్రపంచవ్యాప్తంగా సంపద తరలింపు విస్తృతమవుతోంది. ఎన్‌డబ్ల్యూ వరల్డ్‌ నివేదిక ప్రకారం గతేడాదిలో 95,000 మంది కోటీశ్వరులు తమ దేశాలను వీడి ఇతర దేశాలకు వలసవెళ్లారు. 2016లో ఈ సంఖ్య 82,000కాగా.. 2015లో 64,000 మాత్రమే. 
అభివృద్ధి చెందిన దేశాలైన చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, సింగపూర్, వియత్నాంలతో పోలిస్తే ఆస్ట్రేలియా వ్యాపారానికి అనువని అంచనా. పైగా భద్రత విషయంలోనూ ఈ దేశానికి మంచి పేరు ఉంది.

ఎందుకు వెళుతున్నారు? 
అభివృద్ధి చెందిన దేశాల్లో మంచి వ్యాపార అవకాశాలు, అక్కడ వ్యాపారస్తులకు కల్పించే రాయితీలు మన దేశంలోని పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. భవిష్యత్‌ తరాలకు మన దేశంలో అవకాశాలు తక్కువగా ఉండడం, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వారసత్వంగా వచ్చే ఆస్తులపై పన్నుల్లేకపోవడం వంటివి కూడా వలసలకు కారణమవుతున్నాయి. పశ్చిమ ఆసియాలో, సింగపూర్‌లాంటి చోట్ల అమలు చేస్తున్న అత్యధిక పన్నుల కారణంగా కూడా అక్కడి సంపన్నులు వారి దేశాల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుని.. చౌకగా వ్యాపారానికి అనువుగా ఉండి, ఎక్కువ రాయితీలు కలిగిన దేశాలకు వస్తున్నారు. 

మరిన్ని వార్తలు