బీజేపీ కాంగ్రెస్‌ల మ్యాచ్ ఫిక్సింగ్

26 Mar, 2015 02:53 IST|Sakshi
బీజేపీ కాంగ్రెస్‌ల మ్యాచ్ ఫిక్సింగ్

పుదుచ్చేరి: సంస్కరణల పేరిట దేశ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు (కుమ్మక్కు) ఒడిగట్టాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ, బీమా సవరణ బిల్లు వంటివి పార్లమెంటులో పాసవుతున్న తీరే ఇందుకు నిదర్శనమన్నారు. బుధవారమిక్కడ అట్టహాసంగా ప్రారంభమైన సీపీఐ 22వ జాతీయ మహాసభలలో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ సభలకు పార్టీ కురువృద్ధుడు ఏబీ బర్దన్, రవీంద్రకుమారన్, ద్రుపద్ బర్గోయ్, అనీ రాజా, సీఎన్ జయదేవన్, విశ్వనాథన్, స్మితా పన్సారే, విశ్వజిత్, ఏఏ ఖాన్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. మహాసభలను సురవరం లాంఛనంగా ప్రారంభించారు.

దేశ సహజ వనరులు, జాతి సంపదను కాపాడే శక్తియుక్తులు కమ్యూనిస్టులకే ఉన్నాయని ఆయన అన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను తిప్పికొట్టి బడుగు బలహీన వర్గాల ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చేది వామపక్ష, ప్రజాతంత్ర శక్తులేనని చెప్పారు. కార్పొరేట్ శక్తుల అండదండలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మతతత్వ శక్తుల చేతిలో పావుగా మారిందని ధ్వజమెత్తారు. ఘర్‌వాప్‌సీ పేరుతో అతివాద హిందూ సంస్థలు మైనారిటీ వ్యతిరేక ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్నాయన్నారు. మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. బహుళజాతి సంస్థలు, విదేశీ పెట్టుబడిదారుల కోసం ప్రధాని నరేంద్రమోదీ నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకునే స్థితిలో లేకపోయాయని విమర్శించారు. విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాలలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మోదీకి ఢిల్లీ ఎన్నికలు ఓ గుణపాఠం...

ప్రభుత్వమే తాను, తానే ప్రభుత్వమన్న రీతిలో ప్రవర్తించిన ప్రధానమంత్రికి ఢిల్లీ ఎన్నికలు పెద్ద గుణపాఠమన్నారు. బీజేపీ ఆర్థిక, మతతత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారనడానికి నిదర్శనమే ఢిల్లీ ఎన్నికలన్నారు. అలాగే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తమకో పాఠమేనని అంగీకరించారు. అంతమాత్రాన వామపక్షాల నైతిక స్థైర్యమేమీ సడలలేదని చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను తామూ స్వీకరిస్తున్నామని, కచ్చితంగా అధిగమించటానికి వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతే దీనికి సరైన వేదిక అన్నారు.

మరిన్ని వార్తలు