మమతపై నేతాజీ మనవడి పోటీ

10 Mar, 2016 06:53 IST|Sakshi
మమతపై నేతాజీ మనవడి పోటీ

భవానీపూర్ నుంచి చంద్రకుమార్‌ను బరిలోకి దించిన బీజేపీ
 
 న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగనున్నాయి. భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్న సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీతో బీజేపీ అభ్యర్థిగా స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ మనవడైన చంద్రకుమార్ బోస్ తలపడనున్నారు. మమతపై తమ అభ్యర్థిగా 55 ఏళ్ల చంద్రకుమార్ పోటీ చేస్తారని కేంద్రమంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో చెప్పారు.  బెంగాల్ ఎన్నికల కోసం 52 మంది, అస్సాం ఎన్నికల కోసం 88 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా విడుదల చేసింది.

ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ.. ‘బెంగాల్ ప్రజలు మార్పు కోసం 2011లో తృణమూల్‌ను గెలిపించారు.  అయితే మార్పు రాలేదు.  బీజేపీ మాత్రమే మార్పు తెస్తుంది’ అని అన్నారు. మీరు గెలిచే అవకాశముందా అని విలేకర్లు అడగ్గా, ఇది వ్యక్తిగత పోటీ కాదని, ప్రజల అంశమని అన్నారు. చంద్రకుమార్ నేతాజీ అన్న అయిన శరత్‌చంద్ర బోస్ మనవడు. ఆయన ఈ ఏడాది జనవరి 25న బీజేపీలో చేరారు.  కాగా, ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఎం పొత్తు అనైతికమని, దానికి ఆ పార్టీల కార్యకర్తలు మద్దతిస్తారా? అని మమత ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నల్లధనం చలామణి, ఓటర్లకు అక్రమ తాయిలాలపై కన్నేయడానికి ఎన్నికల సంఘం ఆదాయపన్ను శాఖ నుంచి 30 మంది ఐఆర్‌ఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించింది.

మరిన్ని వార్తలు