‘వాళ్లనూ ఎడ్యుకేట్‌ చేయాలి’

14 Jan, 2020 17:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై చదువుకున్న వారికి సైతం అవగాహన కల్పించాలనేందుకు సత్య నాదెళ్ల వ్యాఖ్యలే సరైన ఉదాహరణని ఆమె అన్నారు. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌ల్లో నిరాదరణకు గురవుతున్న మైనారిటీలకు అవకాశాలు కల్పించేందుకే పౌరసత్వ సవరణ చట్టం ప్రధాన ఉద్దేశమని ఆమె ట్వీట్‌ చేశారు. ఇదే ట్వీట్‌లో ఆమె మైక్రోసాఫ్ట్‌ కొలువుతీరిన అమెరికాలో యెజ్దీల స్ధానంలో సిరియన్‌ ముస్లింలకు ఎందుకు అలాంటి అవకాశాలు కల్పించడం లేదని మీనాక్షి లేఖి విస్మయం వ్యక్తం చేశారు.

ఇరాక్‌, సిరియా, టర్కీల్లో ఉన్న యెజ్దీలను లక్ష్యంగా చేసుకుని ఐఎస్‌ చెలరేగడంతో ఉగ్ర సంస్థ ఆగడాలు భరించలేని యెజ్దీల్లో 15 శాతం మందిపైగా ఇతర దేశాలకు పారిపోయారు. సీఏఏ సరైన చర్య కాదని, భారత్‌కు వచ్చిన ఓ బంగ్లాదేశీ భారత్‌లో మరో యూనికార్న్‌ను సృష్టించడం లేదా ఇన్ఫోసిస్‌కు సీఈవో స్ధాయికి ఎదగడం వంటివి చూడాలని తాను కోరుకుంటానని మన ఉద్దేశాలు అలా ఉండాలని సత్య నాదెళ్ల బజ్‌ఫీడ్‌ ఎడిటర్‌ బెన్‌ స్మిత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.

చదవండి : సీఏఏపై సత్య నాదెళ్ల ఏమన్నారంటే..

మరిన్ని వార్తలు