కరోనా వైరస్‌ మానవ తప్పిదమే!

19 Mar, 2020 19:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : వివిధ రకాల వైరస్‌ల వల్ల సంక్రమిస్తోన్న వ్యాధులను ఆంగ్లంలో ‘జూనాటిక్‌ డిసీసెస్‌’ లేదా ‘జూనోసెస్‌’ అని అంటారు. అంటే జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులని అర్థం. మానవులకు సంక్రమించే వ్యాధుల్లో 75 శాతం అంటువ్యాధులు కాగా, వాటిలో 60 శాతం జంతువుల నుంచి సంక్రమిస్తున్నవే. నేడు ప్రపంచ దేశాల ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న కోవిడ్‌ వైరస్‌ కూడా ఆ కోవకు చెందినదే. సార్స్‌ (సీవియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) పునుగు పిల్లుల నుంచి రాగా, మెర్స్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌), ఒంటెల వల్ల రాగా, ఎబోలా, బర్డ్‌ ఫ్లూలు ఇతర జంతువుల నుంచి వచ్చాయి. (పారాసిటమాల్‌ మింగి.. దర్జాగా ఇంటికి..!)

వ్యవసాయ విస్తరణ లేదా పట్టణీకరణ లేదా మరే ఇతర కారణాల వల్ల జంతువులు, ఇతర వన్య ప్రాణులు జీవించే అడువులను నరికి వేయడం వల్ల జంతువుల ఆరోగ్యం క్షీణించి వైరస్‌ల బారిన పడుతున్నాయి. వాటిలో బలిష్టంగా రూపాంతరం చెంతుతోన్న పలు రకాల వైరస్‌లు వాటి నుంచి మనుషులకు సోకుతున్నాయి. అడవులను నరికివేయడం వల్ల పర్యావరణ పరిస్థితులు దెబ్బతినడంతోపాటు ఇలాంటి అనర్థాలు సంభవిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం విభాగం 2016లోనే ఓ నివేదికలో హెచ్చరించింది. (కరోనా: కృత్రిమంగా తయారు చేసింది కాదు!)

ఒక్క 2018లోనే చెట్లు నరికివేయడం వల్ల, కార్చిచ్చుల వల్ల 1.20 కోట్ల హెక్టార్ల అడవులు నశించాయని, బ్రెజిల్, ఇండోనేసియా, మలేసియా దేశాల్లో ఎక్కువ అడవులు నశించాయని ‘గ్లోబల్‌ వారెస్ట్‌ వాచ్‌’ ఓ నివేదికలో వెల్లడించింది. పట్టణీకరణలో భాగంగా అతి తక్కువ స్థలంలో జన సాంద్రత ఎక్కువగా ఉండడం, సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒకరికి సోకిన వైరస్‌ ఇతరులకు వేగంగా వ్యాపిస్తోందని ఆ నివేదికలో ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. పర్యావరణ ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే ప్రపంచ మానవాళి మనుగడ బాగుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆహార, వ్యవసాయ సంస్థ పిలుపునివ్వగా, ‘జంతువులు, అడవుల ఆరోగ్యంపైనే మానవులు ఆరోగ్యం ఆధారపడి ఉంది’ అని ‘ది సెంటర్‌ ఫర్‌ పీపుల్‌ అండ్‌ ఫారెస్ట్స్‌ ఇన్‌ బ్యాంగ్‌కాగ్‌’ ఎగ్సిక్యూటివ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ గ్యాంగ్‌ వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా వైరస్‌ల విజృంభణకు మానవ తప్పిదనమని స్పష్టం అవుతోంది. (ప్రపంచ దేశాల్లో ప్రజా దిగ్భందనం)

మరిన్ని వార్తలు