ఒక్క వాతతో జబ్బులన్ని నయం

31 Mar, 2018 14:04 IST|Sakshi

సవాయి మాధోపూర్‌, రాజస్థాన్‌ : ఓ పక్క అంగారకునిపై ఆవాసానికి ఏర్పాట్లు జరుగుతుంటే మరొపక్క దగ్గు, జలుబు లాంటి చిన్నచిన్న వ్యాధులను తగ్గించడానికి నేటికి నాటువైద్యాన్ని, మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్న పరిస్థితుల్లో భారత గ్రామీణం ఉంది. అనారోగ్యాన్ని నయం చేస్తుందని నమ్మి మంత్రగత్తె వద్దకు వెళ్తే యాసిడ్‌తో చిన్నారి ఛాతి, కాళ్లను కాల్చిన సంఘటన రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

ఒక నెల వయసున్న పసికందు ప్రియాంషు కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్నాడు. బంధువుల సలహతో ఈ నెల 26న పసివాడి తల్లి ప్రియాంషును వినోబా బస్తీలో ఉన్న ఓ మహిళ వద్దకు తీసుకెళ్లింది. న్యూమోనియాను తగ్గించడం కోసం ఆ మహిళ చిన్నారి ఛాతి మీద రసాయనాలు పోసింది. దాంతో చిన్నారి ఛాతి, పాదాలు కాలిపోయాయి. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయాలతో ఉన్న చిన్నారిని చూసి డాక్టర్లు కొత్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత ఆస్పత్రిలో చేర్చుకున్నారు. పోలీసులు శుక్రవారం సదరు మహిళను అరెస్టు చేశారు.

విషయం తెలుసుకున్న సవాయి మాధోపూర్‌ జిల్లా కలెక్టర్‌ కేసీ వర్మ ఆస్పత్రికి వచ్చి చిన్నారిని పరమార్శించారు. ఈ విషయం గురించి గ్రామస్తులను విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మాయగాళ్ల చేతిలో మోసపోవద్దని ప్రజలకు సూచించారు. సవాయి జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ నాలుగు నెలల చిన్నారికి దగ్గు, జలుబు నయం చేయడానికి ఇనుపకడ్డితో వాత పెట్టారు. ఈ విషయం గురించి పోలీసులకు తెలియడంతో చిన్నారిని మహాత్మ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలాగే మరో 10నెలల చిన్నారికి న్యూమోనియా తగ్గడం కోసం ఆమె తాత ఇనుప కడ్డితో వాత పెట్టాడు. దాంతో ఆ పాప మరణించింది.

మూఢవిశ్వాసానికి సంబంధించిన కేసులు ఇక్కడ సాధరణమని మహాత్మ గాంధీ ఆస్పత్రి పీడియాట్రిక్‌ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఓపీ అగల్‌ తెలిపారు. రాజస్థాన్‌ ప్రభుత్వం న్యూమోనియాను నివారించడం కోసం ఏప్రిల్‌ నుంచి రాష్ట్రంలోని 9జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. న్యూమోనియా నివారణ కోసం పిల్లలకు న్యూమోనియా ‘కాన్జుగేట్‌’ టీకాను ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

>
మరిన్ని వార్తలు