చిక్కుల్లో మాజీ సీజే తహిల్‌

1 Oct, 2019 08:17 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై : కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన మద్రాసు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి తహిల్‌రమణి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మాజీ సీజేగా పనిచేసిన కాలంలో ఆమె అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) చేసిన అభియోగంపై సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. వివరాలు... మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న తహిల్‌ రమణిని సుప్రీంకోర్టు కొలీజియం మేఘాలయ హైకోర్టుకు ఇటీవల బదిలీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిని ఆశిస్తున్న దశలో దేశంలోనే అత్యంత చిన్నదైన మేఘాలయ హైకోర్టు బదిలీచేయడం అవమానంగా భావించినట్లు సమాచారం. ఈ క్రమంలో కొలీజియం నిర్ణయాన్ని నిరసిస్తూ తన పదవికి ఆమె రాజీనామా చేయగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ఆమోదించారు. ఇదిలా ఉండగా, తహిల్‌రమణిపై ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అవినీతి ఆరోపణలు చేసింది. చెన్నై సెంమ్మంజేరీ, తిరువిడందైలలో తహిల్‌రమణి జూన్, జూలైలలో రెండు అపార్టుమెంట్లను కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు వెనుక అవినీతి ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఆరోపిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగాయ్‌కు ఐదు పేజీల నివేదికను సమర్పించింది. ఐబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ మేరకు ఐబీ అధికారులు విచారణ ప్రారంభించారు.(చదవండి : సీజే తహిల్‌ రాజీనామాకు ఆమోదం

కాగా మాజీ సీజే కొనుగోలు రెండు ఇళ్లను లోరియన్‌ టవర్‌ అనే సంస్థ నిర్మించిన అపార్టుమెంట్లలోనివే. వీటి విలువ రూ.3.18 కోట్లు అని తెలుస్తోంది. ఇందులో రూ.1.62 కోట్లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రుణం పొంది చెల్లించారు. మిగిలిన రూ.1.56 లక్షలను సొంతంగా చెల్లించారు. ఈ నగదు చెల్లింపులు తన బంధువులకు చెందిన ఆరు బ్యాంకు ఖాతాల నుంచి బదలాయింపు జరిగింది. వీటిల్లో మూడు ఖాతాలు తన భర్తతో జాయింట్‌ అకౌంట్‌గా ఉంది. మరోటి తన కుమారుడి జాయింట్‌ అకౌంట్‌. మరోటి తల్లితో జాయింట్‌ అకౌంట్‌. ఇంకోటి తన జీతానికి సంబంధించిన అకౌంట్‌. ఇదిలా ఉండగా, రూ.18 లక్షలు తహిల్‌రమణి, ఆమె తల్లి జాయింట్‌ అకౌంట్‌లోకి చేరగా కేవలం ఒక నెలలో మరో ఖాతాకు బదలాయింపు జరిగింది. ఇలా బ్యాంకు ఖాతాలకు నగదు బదలాయింపులపై ఐబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. తమిళనాడుకు చెందిన ఒక కేసు విచారణను కొట్టివేసిన నేపథ్యంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని, నగదు లావాదేవీలు జరిగి ఉండొచ్చని ఆరోపిస్తోంది. తమిళనాడులో విగ్రహాల అక్రమరవాణా కేసులకు సంబంధించి 2018లో ప్రత్యేక విచారణ బెంచ్‌ ఏర్పడగా న్యాయమూర్తి మహాదేవన్‌ అనేక కఠిన మైన చర్యలు తీసుకున్నారు. ఈ ప్రత్యేక బెంచ్‌ను అప్పటి ప్రధాన న్యాయమూర్తి తహిల్‌రమణి రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ రద్దు వెనుక అక్రమాలు చోటుచేసుకుని ఉండే అవకాశాలు ఉన్నాయని ఐబీ సందేహిస్తోంది.  

మరిన్ని వార్తలు