పూర్తి స్వేచ్ఛ కావాలి: సీబీఐ

17 Jul, 2013 04:42 IST|Sakshi
పూర్తి స్వేచ్ఛ కావాలి:సీబీఐ

‘సాక్షి’ లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: సీబీఐ పనితీరు ప్రభుత్వ ‘పంజరంలో చిలుక’లా ఉందన్న సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లతో మేల్కొన్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ విషయంలో తాము కోరుకుంటున్న మార్పులను విస్పష్టంగా బయటపెట్టింది. తమకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు, కేసుల దర్యాప్తులో రాజకీయ జోక్యాన్ని నివారించేందుకు కేంద్రం చేసిన పలు ప్రతిపాదనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రతిపాదనలు సరిపోవని పేర్కొంది. కేసుల సరైన దర్యాప్తు కోసం ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో విధి నిర్వహణ స్వేచ్ఛతోపాటు ఆర్థిక స్వేచ్ఛ కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 14 పేజీలతో కూడిన అఫిడవిట్‌ను మంగళవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ అఫిడవిట్ బుధవారం సుప్రీం పరిశీలనకు రానుంది.
 
 మరిన్ని అధికారాలివ్వాలి...
 
 తాము కోరుకుంటున్న ‘‘విధి నిర్వహణ స్వేచ్ఛ’’ ఎక్కువగా సంస్థ డెరైక్టర్‌కు ఉండే పరిపాలన, ఆర్థిక అధికారాలపై ఆధారపడి ఉంటుందని సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే ప్రస్తుత విధానంలో సీబీఐ డెరైక్టర్‌కు పరిమితమైన పరిపాలన, ఆర్థిక, క్రమశిక్షణ అధికారాలు ఉన్నాయని...ఇది కేసుల సత్వర దర్యాప్తు సాగేలా చూడటంలో డెరైక్టర్ సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపేలా ఉందని వివరించింది. అలాగే కిందిస్థాయి సిబ్బందిలో డెరైక్టర్ ఉన్నత నైతిక ప్రమాణాలను నెలకొల్పడంలో కూడా అడ్డంకిగా మారిందని పేర్కొంది. అందువల్ల తమకు స్వయంప్రతిపత్తి కల్పించేందుకు, బాహ్య ప్రభావాల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సీబీఐ పేర్కొంది. ముఖ్యంగా సీబీఐ డెరైక్టర్....కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ (డీవోపీటీ)కు జవాబుదారీగా ఉండే బదులు నేరుగా సంబంధిత మంత్రికి జవాబుదారుగా ఉండేలా కేంద్ర కార్యదర్శితో సమాన హోదాతో ఎక్స్ అఫీషియో అధికారాలు కల్పించాలని డిమాండ్ చేసింది.
 
 ‘‘సాధారణ పరిపాలన, ఆర్థిక అనుమతుల కోసం మంత్రిత్వశాఖపై ఆధారపడే సీబీఐ డెరైక్టర్ క్లిష్ట సమయాల్లో స్వతంత్ర, నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోలేరు. విధినిర్వహణలో ఒత్తిళ్లకు తలొగ్గకుండా పక్షపాతం చూపకుండా వ్యవహరించేందుకు సీబీఐ డెరైక్టర్‌కు సాధారణ పరిపాలన, ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండటం కచ్చితంగా అవసరం’’ అని సీబీఐ తన అఫిడవిట్‌లో వాదించింది. అలాగే డెరైక్టర్ కనీస పదవీకాలాన్ని ప్రభుత్వం సూచిస్తున్నట్లుగా రెండేళ్లకు బదులు మూడేళ్లు చేయాలని సీబీఐ పట్టుబట్టింది. దర్యాప్తు అధికారులపై వచ్చే దుష్ర్పవర్తన, అక్రమాల ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గుదేల్చేందుకు జవాబుదారీ కమిషన్ ఏర్పాటు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ చర్య పరోక్షంగా క్రమశిక్షణారాహిత్యానికి దారితీస్తుందని వాదించింది. అధికారుల అక్రమాలపై విచారణ కోసం తమకు అంతర్గత వ్యవస్థ ఉందని గుర్తుచేసింది.
 
 కమిటీ ద్వారా నియామకానికి ఓకే...
 
 ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తో కూడిన కమిటీ ద్వారా సీబీఐ డెరైక్టర్ నియామకం జరగాలన్న కేంద్రం ప్రతిపాదనకు సీబీఐ ఆమోదం తెలిపింది. అయితే ఈ విషయంలో పదవీవిరమణ చేయనున్న డెరైక్టర్ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అలాగే అవినీతి నిరోధక (పీసీ) చట్టం పరిధిలోకి వచ్చే కేసులు తప్ప మిగిలిన కేసుల్లో సీబీఐ తమ అధికార పర్యవేక్షణలోనే ఉండాలన్న ప్రతిపాదనకు దర్యాప్తు సంస్థ అంగీకరించింది. పీసీ చట్టం కింద దర్యాప్తు చేసే కేసుల్లో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) అధికార పర్యవేక్షణలో సీబీఐ పనిచేయనుంది. సీబీఐలో భారీ స్థాయిలో ఎస్పీ స్థాయి పోస్టులు ఖాళీగా ఉండటం, వాటి భర్తీలో జాప్యం జరుగుతున్న దృష్ట్యా సంస్థ డెరైక్టర్‌కు ఎస్పీ స్థాయి అధికారులను నేరుగా నియమించుకునే అధికారం కల్పించాలని అఫిడవిట్‌లో దర్యాప్తు సంస్థ కోరింది.
 
  ప్రస్తుతం ఎస్‌ఐ స్థాయి అధికారులనే డెరైక్టర్ నియమించుకోగలుగుతున్నారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ అధికారులపై దర్యాప్తు కోసం మూడు నెలల్లో అనుమతి లభించకపోతే సీబీఐ నేరుగా దర్యాప్తు ప్రారంభిం చుకోవచ్చన్న ప్రతిపాదనలకు దర్యాప్తు సంస్థ ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్రాల్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వరంగ సంస్థల అధికారులపై దర్యాప్తునకు ఆయా రాష్ట్రాల అనుమతి నిబంధన విషయంలో మినహాయింపు అవసరమని పేర్కొంది. లాయర్ల నియామకంలో తమకు మరింత స్వేచ్ఛ కావాలని సీబీఐ పేర్కొంది. ఇందుకు న్యాయశాఖ అనుమతి ఉండాలన్న నిబంధనను తొలగించాలని సూచించింది. ప్రస్తుతం సీబీఐ డెరైక్టర్, సీబీఐ డెరైక్టర్ (ప్రాసిక్యూషన్) మధ్య ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే ఈ అంశంలో సీబీఐ అటార్నీ జనరల్ అభిప్రాయం కోరుతోంది. అయితే అప్పీలు, రివిజన్ కేసుల్లో (దర్యాప్తు వ్యవహారాలను మినహాయించి) ఒకవేళ సీబీఐ డెరైక్టర్ (ప్రాసిక్యూషన్) సూచనతో సీబీఐ డెరైక్టర్ విభేదించి అటార్నీ జనరల్ అభిప్రాయం కోసం పంపినా అంతిమ నిర్ణయం మాత్రం సీబీఐ డెరైక్టర్‌దే ఉండాలని సీబీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది.
 

మరిన్ని వార్తలు