కశ్మీర్‌లో మళ్లీ ‘ఆపరేషన్లు’

18 Jun, 2018 05:26 IST|Sakshi

రంజాన్‌ విరామం తర్వాత పునఃప్రారంభం

కేంద్రం ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాజకీయ పార్టీలు

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: రంజాన్‌ సందర్భంగా నెల రోజుల పాటు జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వాటిని పునరుద్ధరించింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అన్ని అత్యవసర చర్యలు తీసుకోవాలని, ఉగ్ర దాడులు, హత్యాకాండ వంటి వాటిని నిలువరించాలని భద్రతా దళాలను ఆదేశించామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, హింస లేని వాతావరణం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

శాంతి కోరుకునే వారంతా ఏకతాటిపైకి రావాలని, తప్పు దారిలో వెళుతున్న వారిని శాంతి మార్గంలోకి తీసుకురావాలని కోరారు.∙రంజాన్‌ మాసం సందర్భంగా మే 17 నుంచి కశ్మీర్‌లో సైనిక ఆపరేషన్లను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. రంజాన్‌ మాసం ప్రశాంతంగా సాగేందుకు ఆపరేషన్లను నిలుపుదల చేసి సహకరించిన భద్రతా బలగాలను రాజ్‌నాథ్‌ అభినందించారు. అధికారిక సమాచారం ప్రకారం ఏప్రిల్‌ 17 నుంచి మే 17 మధ్య 18 ఉగ్ర దాడుల సంఘటనలు నమోదైతే.. ఆపరేషన్ల నిలుపుదల తర్వాత ఆ సంఖ్య 50కిపైగా పెరిగింది.

నిరాశ కలిగించింది: రాజకీయ పార్టీలు
‘కేంద్రం ప్రకటన అసంతృప్తి కలిగించింది. ఇది అనూహ్య పరిణామం’ అని ప్రధాన ప్రతిపక్షం నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) అధికార ప్రతినిధి జునైద్‌ మట్టు అన్నారు. భద్రతా దళాల కార్యకలాపాల విరమణను సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుని ఉండాల్సిందన్నారు.   కేంద్రం నిర్ణయం నిరాశ కలిగించిందనీ, ప్రస్తుత పరిస్థితుల్లో విరమణ పొడిగింపు సాధ్యం కాదని అధికార పీడీపీ ప్రధాన కార్యదర్శి పీర్జాదా మన్సూర్‌ అన్నారు. ‘శాంతి ప్రక్రియ టూ వే ట్రాఫిక్‌ లాంటిది. మా తరఫున చేయాల్సిందంతా చేశాం. విశ్వాసం కలిగించే చర్యలన్నిటినీ తీసుకున్నాం. కానీ బుఖారీకి ఏం జరిగింది? ఆయన్ను నిర్దాక్షిణ్యంగా చంపేశారు’ అని పీర్జాదా అన్నారు. కశ్మీర్‌ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టమైన విధానం లేదని జమ్మూ కశ్మీర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు జీఏ మిర్‌ విమర్శించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు