6 రోజుల్లో 8 తీర్పులు

25 Sep, 2018 05:03 IST|Sakshi
సీజేఐ దీపక్‌ మిశ్రా

చివరి పనిదినాల్లో కీలక తీర్పులు వెలువరించనున్న సీజేఐ దీపక్‌ మిశ్రా

ఆధార్‌ నుంచి అయోధ్య వరకు.. అన్నీ ప్రధానమైనవే

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ–చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా)గా ఉన్న జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు సుప్రీంకోర్టులో మరో ఆరు పనిదినాలే మిగిలున్నాయి. వచ్చే నెల 2న ఆయన పదవీ విరమణ పొందనున్నారు. అత్యధిక రాజ్యాంగ ధర్మాసనాలకు నేతృత్వం వహించిన సీజేఐగా జస్టిస్‌ మిశ్రా ఘనత వహించారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఐపీసీ సెక్షన్‌ 377ను రద్దు చేస్తూ జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇప్పటికే ఓ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. అయితే మిగిలున్న ఆరు పనిదినాల్లో జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని వివిధ ధర్మాసనాలు ఎనిమిది కీలక కేసుల్లో తీర్పులు వెలువరించనున్నాయి. ఆధార్‌ చెల్లుబాటు నుంచి అయోధ్య కేసు వరకు.. దేశ గతిని మార్చగల ఈ తీర్పులు చెప్పే వివిధ ధర్మాసనాల్లో మొత్తం కలిపి పది మంది న్యాయమూర్తులు పాలుపంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనాలు వెలువరించే ఎనిమిది కీలక కేసులేంటో ఓ సారి పరిశీలిద్దాం..

1. ఆధార్‌ కేసు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి చిన్న పనికీ ఆధార్‌ కావాలంటున్న ఈ రోజుల్లో అసలు ఆధార్‌ కార్డే చెల్లుబాటు కాదనీ, దానికి రాజ్యాం గబద్ధత లేదనీ, వ్యక్తిగత గోప్యత హక్కును ఆధార్‌ ఉల్లంఘిస్తోందంటూ అనేక పిటిషన్లు వచ్చాయి. హైకోర్టు మాజీ జస్టిస్‌ కె.పుట్టస్వామి కూడా ఈ పిటిషన్లు వేసిన వారిలో ఉన్నారు. ఈ పిటిషన్లన్నింటినీ కలిపి ఐదుగురు సభ్యుల ధర్మాసనం 40 రోజులపాటు ఏకధాటిగా విచారించి నాలుగున్నర నెలల ముందే తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఆ తీర్పు ఈ ఆరు రోజుల్లో వెలువడనుంది.

2. అయోధ్య కేసు
వివాదాస్పద రామ జన్మభూమి–బాబ్రీ మసీదుకు చెందిన 2.77 ఎకరాల భూమిని రామ్‌ లల్లా, సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖాడాల మధ్య సమానంగా పంచుతూ అలహాబాద్‌ హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయలా? వద్దా? అన్న విషయంపై ప్రస్తుత త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం ప్రకటించనుంది.

3. పదోన్నతుల్లో రిజర్వేషన్ల కేసు
ప్రభ్యుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ 2006లో ఎం.నాగరాజ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తుత సీజేఐ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సమీక్షించనుంది. పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లను తొలగించేం దుకు మోదీ ప్రభుత్వం విముఖంగా ఉండగా, తరతరాల నుంచి ఐఏఎస్‌ అధికారులుగా ఉంటున్నవారి కుటుంబీకులు కూడా రిజర్వేషన్లను ఉపయోగించుకుంటున్నారనీ, అదేమీ వారసత్వ హక్కు కాదని సుప్రీంకోర్టు అంటోంది.

4. శబరిమల ఆలయ ప్రవేశం కేసు
10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న బాలికలు, మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమ తించాలా? వద్దా? అన్న విషయంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పనుంది. పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా కార్యకర్తలు స్త్రీలకు కూడా ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్‌ చేస్తుండగా సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తుండటం తెలిసిందే.

5. వ్యభిచారం కేసు
వ్యభిచారం, వివాహేతర సంబంధం కేసుల్లో మహిళ తప్పు ఉన్నా కూడా ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ పురుషుడిపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్న అంశంపై కూడా సీజేఐ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ తీర్పు వెలువరించనుంది. ఐపీసీ సెక్షన్‌ 497కు సవరణలు చేసి మహిళపై కూడా కేసులు నమోదు చేసేందుకు కోర్టు అనుమతించే అవకాశం ఉంది.

6. విచారణల ప్రత్యక్ష ప్రసారాల కేసు
కోర్టుల్లో జడ్జీలు కేసులను విచారిస్తుండగా ఆ దృశ్యాలను ప్రత్యక్షప్రసారం చేయాలన్న కేసుకు సంబంధించి సీజేఐ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పనుంది. న్యాయమూర్తులు సానుకూలంగా స్పందిస్తే ముందుగా సీజేఐ విచారించే కేసులను ప్రయోగాత్మకంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

7. నేర ప్రజా ప్రతినిధులపై నిషేధం కేసు
రాజకీయ నేతలపై ఏదైనా కోర్టు నేరాలు, అభియోగాలు మోపితే.. వారిని ఇకపై రాజకీయాల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ వచ్చిన ఓ ప్రజాహిత వ్యాజ్యంపై జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ప్రస్తుతం రాజకీయ నేతలు దోషులుగా తేలితేనే నిషేధం వర్తిస్తుండగా తుది తీర్పులు రావడానికి దశాబ్దాలు గడిచిపోతున్నాయి.

8. లాయర్లుగా ప్రజాప్రతినిధులు..
ప్రస్తుత రాజకీయ నాయకుల్లో చాలా మంది న్యాయవాదులై ఉండి కోర్టుల్లో కేసులు కూడా వాదిస్తున్నారు. న్యాయవాదులుగా ఉన్నవారు పార్లమెంటుకు లేదా శాసనసభలకు ఎన్నికైతే వారికి ప్రభుత్వం వేతనం చెల్లిస్తోందనీ, వారు మళ్లీ సొంత సంపాదన కోసం కోర్టుల్లో కేసులు వాదిస్తూ ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలు నెరవేర్చడం లేదు కాబట్టి వారు కోర్టులకు వెళ్లకుండా నిలువరించాలంటూ వచ్చిన పిటిషన్‌పై కూడా తీర్పు రానుంది.

మరిన్ని వార్తలు