ఆప్కు మద్దతివ్వడంపై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు

24 Dec, 2013 16:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కాంగ్రెస్ మద్దతివ్వడంపై అప్పుడే పార్టీలో లుకలుకలు ప్రారంభమైయ్యాయి. ఆప్ కు మద్దతివ్వడం సరికాదంటూ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం భావిస్తున్నట్లు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జనార్ధన్ ద్వివేది తెలిపారు. కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించలేదన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ద్వివేది.. ఏఏపీకి మద్దతుపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలున్నట్లు తెలిపారు. పార్టీని ప్రజలు గెలిపించలేదని, ప్రతిపక్షంలో కూర్చుని ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

 

అందరి ఊహలకూ, అంచనాలకూ భిన్నంగా ఢిల్లీ ఎన్నికల్లో 28 స్థానాలు తెచ్చుకుని ద్వితీయ స్థానంలో నిలబడిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. అయితే, ఫలితాలు వెలువడి 28 స్థానాలు వచ్చాయని నిర్ధారణ కాగానే ఓటర్లు తమకు అధికారం అప్పగించలేదు కాబట్టి... తాము అందుకు సుముఖంగా లేమని ఆ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక రాష్ట్రపతి పాలన తప్ప మార్గంలేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కేంద్రానికి నివేదిక కూడా పంపారు. ఈ తరుణంలో ఆప్  కాంగ్రెస్ మద్దతుతో ఆప్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది.ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ముసలం మొదలైంది. ఆప్ కు మద్దతివ్వాలని ఒక వర్గం భావిస్తుండగా, మరో వర్గం దూరంగా ఉంటేనే మంచిదని అభిప్రాయ పడుతుంది.

 

 

 

మరిన్ని వార్తలు