మోదీ మ్యాజిక్‌ పనిచేస్తుందా?

5 Nov, 2017 01:49 IST|Sakshi

హిమాచల్‌లో గెలుపుపై బీజేపీ ధీమా

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: ‘‘హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ గెలుస్తోంది. నేను ప్రచారం చేయాల్సిన అవసరమే లేదు’’ అంటూనే గురువారం ప్రధాని మోదీ హిమాచల్‌లోని కాంగ్డాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ప్రతి శాసనసభ ఎన్నికల్లోనూ పాలకపక్షాన్ని ఓడించడం ఇక్కడివారికి అలవాటుగా మారడం, 2014 పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లూ బీజేపీ వశం కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే మోదీ ధీమాగా ఉన్నారనిపిస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వానిది అసమర్థ, అస్తవ్యస్త పాలన అనే విమర్శలు ఉండటం, సీఎంపై అవినీతి కేసులతోఈ ఎన్నికల్లో హస్తానికి ప్రతికూల వాతావరణం ఉండొచ్చు.  రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన 73 ఏళ్ల ప్రేమ్‌ కుమార్‌ ధూమల్‌ను బీజేపీ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. మోదీ జనాకర్షణపై నమ్మకం లేకనే ధూమల్‌ పేరు చెప్పారని కాంగ్రెస్‌ ఎగతాళి చేసినా రాష్ట్ర ప్రజల్లో, బీజేపీ శ్రేణుల్లో గందరగోళానికి తెరపడింది.

2014 నాటి పరిస్థితి ఇప్పుడుందా?
కిందటి లోక్‌సభ ఎన్నికలనాటి మోదీ మ్యాజిక్‌ ఇప్పుడు అదే స్థాయిలో పనిచేస్తుందా? అంటే అనుమానమే. ఏడాది క్రితం మోదీ పాత పెద్దనోట్లను రద్దు చేయడం, జూలై నుంచి ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేశాయి. ఈ చర్యల వల్ల హిమాచల్‌లోని యాపిల్‌ రైతులు, ఇతర వ్యాపారులు నష్టపోయారు. ఉపాధి అవకాశాలు తగ్గాయి.బీజేపీపై జనంలో మోజు గతంలో మాదిరిగా లేదు. కాంగ్రెస్‌ తన గెలుపు కోసం నోట్లరద్దు, జీఎస్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతనే నమ్ముకుంది. మరోవైపు బ్రాహ్మణుడైన కేంద్రమంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డాను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం బాగా జరిగింది. అలా జరిగితే రాజపుత్రుల ఆగ్రహం తప్పదనే భయంతోనే మళ్లీ ధూమల్‌ను సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.

కాంగ్డా జిల్లాలో బీసీలే కీలకం!
పొరుగు రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో మాదిరిగానే హిమాచల్‌లో కూడా బీసీల జనాభా బాగా తక్కువ. అగ్రకులాల సంఖ్యాబలం ఉన్న హిమాచల్‌లో బీసీల జనాభా కేవలం 18 శాతం మాత్రమే. అయితే, పంజాబ్‌ నుంచి విడదీసి హిమాచల్‌లో కలిపిన కాంగ్డా జిల్లాలో బీసీలు ఎక్కువే. 16 అసెంబ్లీ సీట్లున్న కాంగ్డాలో సగానికి పైగా జనాభా ఓబీసీలే. గుజరాత్‌లో మాదిరిగా ఉద్యోగాల్లో 27 శాతం కోటా కావాలని బాహాటంగా అడగకపోయినా, ఈ వర్గంలో ఆ మేరకు చర్చ జరుగుతోంది. చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న బీసీలు రెండు ప్రధానపక్షాల్లో ఎటు మొగ్గితే ఆ పార్టీదే గెలుపు. మొదట 1993లో సీఎం అయిన వీరభద్ర తొలిసారి బీసీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించి చివరికి కోటాను 18 శాతానికి పెంచారు. అందుకే బీసీలు మొదట్లో కాంగ్రెస్‌కే అనుకూలంగా ఓటేసేవారు. తర్వాత నెమ్మదినెమ్మదిగా చాలా మంది కాషాయపక్షం వైపు వెళ్లిపోయారు. ముస్లింలు రెండు శాతమే కావడంతో హిమాచల్‌లో మత ప్రాతిపదికన ఎన్నికల్లో జనసమీకరణ జరగలేదు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్‌ 2012లో మాదిరిగా మరోసారి మెజారిటీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో సర్వశక్తులూ ఒడ్డుతోంది. బీజేపీ ఈసారి 50కి పైగా సీట్లు గెలిచి గద్దెనెక్కాలని ఎన్నికల సమరంలో పోరాడుతోంది.

మరిన్ని వార్తలు