రాజ్యసభలో ‘తెలంగాణ’పై కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం

7 Aug, 2013 02:41 IST|Sakshi
తెలంగాణకు వ్యతిరేకంగా రాజ్యసభలో మంగళవారం రెండోరోజూ నిరసనలు కొనసాగాయి. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకుపోగా, రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరు ఈ అంశంపై ఒక ఎంపీతో వాగ్వాదానికి దిగారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలి’ అనే నినాదం రాసిన ప్లకార్డులు ధరించిన టీడీపీ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి వెల్‌లోకి దూసుకుపోయి, నినాదాలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డితో మంత్రి జేడీ శీలం వాగ్వాదానికి దిగారు.
 
తెలంగాణకు చెందిన పాల్వాయి, సీమాంధ్ర సభ్యులు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని వ్యాఖ్యానించడంతో సీమాంధ్ర సభ్యులు తీవ్రంగా స్పందించారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటంటూ పాల్వాయిని మంత్రి శీలం నిలదీశారు. దీంతో ఇద్దరి నడుమ వాగ్యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి మంత్రి శీలంకు మద్దతు పలికారు. అధికార పార్టీ సభ్యులు మంత్రి శీలం, ఎంపీ పాల్వాయిలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఈలోగా కాంగ్రెస్ సభ్యురాలు అంబికా సోనీ జోక్యం చేసుకుని, గొడవ పడొద్దంటూ వారికి నచ్చచెప్పడంతో వారి వాగ్యుద్ధం సద్దుమణిగింది.
 
అయితే, టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు సాగించడంతో, డిప్యూటీ చైర్మన్ కురియన్ వారిని వారించారు. ఇలాగే సభకు అంతరాయం కొనసాగిస్తే, సస్పెండ్ చేయాల్సి ఉంటుందని వారిని హెచ్చరించారు. అయినా, ఫలితం లేకపోవడంతో వారిని సస్పెండ్ చేసేందుకు తీర్మానాన్ని ప్రతిపాదించాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ను ఆదేశించారు. అయితే, సభలో నిరసన తెలుపుతున్న సభ్యులను సస్పెండ్ చేయడాన్ని తాము అంగీకరించేది లేదని ఏఐఏడీఎంకే నేత మైత్రేయన్, విపక్షనేత అరుణ్ జైట్లీ, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఓబ్రియన్ సహా పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కాగా, ప్రభుత్వమే రభసను కొనసాగిస్తోందని విపక్షనేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. తెలంగాణ అంశంపై పాలకపక్షంలోనే ఏకాభిప్రాయం లేదని, అయినా హడావుడిగా తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం ప్రకటించాయని ఆయన విమర్శించారు. 
 
మరిన్ని వార్తలు