అక్కడ కొట్టుకుందాం.. ఇక్కడ కలిసివెళ్దాం!

18 Jan, 2016 19:41 IST|Sakshi
అక్కడ కొట్టుకుందాం.. ఇక్కడ కలిసివెళ్దాం!

న్యూఢిల్లీ: త్వరలో పశ్చిమ బెంగాల్‌, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య పొత్తు అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలతో కలిసి వెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. బెంగాల్‌లో సుత్తెకొడవలితో కలిసి వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ విభాగం పార్టీ అధిష్ఠానానికి నివేదించినట్టు తెలుస్తోంది. దీంతో వామపక్షాలతో వ్యూహాత్మక సర్దుబాటు చేసుకొని మమతా బెనర్జీని ఎదుర్కోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అయితే, బహిరంగంగా బెంగాల్‌లో కాంగ్రెస్‌, వామపక్షాలు పొత్తు పెట్టుకొనే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే అదే సమయంలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం. అక్కడ ఈ రెండు పార్టీలు బద్ధ శత్రువులుగా ఒకరితో ఒకరు తలపడటం..

ఈ నేపథ్యంలో బెంగాల్‌లోని రాజకీయ సమీకరణలపై ఆ రాష్ట్ర పరిశీలకులుగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు త్వరలోనే అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఓడించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌, వామపక్షాలు కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయని, పొత్తు పెట్టుకోవడమే మంచిదనే అభిప్రాయంతో రెండు పార్టీల శ్రేణులు కూడా ఉన్నాయని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్‌ చౌదరి పేర్కొన్నారు. కాంగ్రెస్, వామపక్షాల పొత్తుతో బెంగాల్‌లో రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతుందని ఆయన అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు