పోయెస్ ‌గార్డెన్‌పై పోరు.. చిన్నమ్మకు చిక్కే

29 May, 2020 10:24 IST|Sakshi

జయ స్మారక మందిర నిర్మాణంపై రగడ

వేదనిలయం మాకే సొంతం: దీప, దీపక్‌

నిర్ణయాధికారం ప్రభుత్వానికి ఉంది: మంత్రి సీవీ షణ్ముగం

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకప్పటి పవర్‌ఫుల్‌ రాజకీయకేంద్రమైన చెన్నై పోయెస్‌ గార్డెన్‌లోని జయలలిత నివాసం స్మారకమందిరం వివాదంలో నలిగిపోతోంది. జయ వారసులు దీప, దీపక్‌ ఒకవైపు, ప్రభుత్వం మరోవైపు సమరం సాగిస్తున్నారు.  దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై పోయెగార్డెన్‌లో అత్యంత విలాసవంతమైన భవనంలో నివసించేవారు. రాజకీయ వర్గాలు ‘గార్డెన్‌’ అని ముద్దుగా పిలుచుకునేవారు. జయలలిత అధికారంలో ఉన్నపుడు ‘గార్డెన్‌’ నుంచి ఆదేశాలు వచ్చాయా అని ముందుగా ప్రశ్నించేవారు. సచివాలయం కంటే పోయెగార్డెన్‌ కే ప్రాధాన్యతతో రాజకీయ, అధికార కేంద్రంగా వెలిగిపోయేది. జయ మరణించిన తరువాత కూడా దాని ప్రాభవం తగ్గలేదు. జయకు వందలకోట్ల రూపాయల ఆస్తులున్నా గార్డెన్‌హౌస్‌ చుట్టూనే రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. జయకు సొంతమైన వందల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తికి ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్‌ వారసులని మద్రాసు హైకోర్టు తేల్చడంతో ఇంతకూ ఆస్తులెక్కడెక్కడ ఉన్నాయి, వాటి విలువ ఎంత అనే అంశంపై జోరుగా చర్చ బయలుదేరింది. (వారిద్దరూ అమ్మ వారసులే)

అవినీతి నిరోధకశాఖ కోర్టులో దాఖలు చేసిన జాబితాలో ఎన్నికల సమయంలో జయలలిత దాఖలు చేసిన నామినేషన్‌ పత్రంలో చూపిన ఆస్తులనే పేర్కొన్నారు. జయకు వారసులమని తమను ప్రకటించి ఆమె ఆస్తుల పర్యవేక్షణ బాధ్యతను తమకు అప్పగించాల్సిందిగా దీప, దీపక్‌ గతంలో వేర్వేరుగా మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం వెలువడిన తీర్పుతో స్పష్టత వచ్చింది. వారిద్దరూ జయ ఆస్తికి రెండోతరం వారసులని కోర్టు పేర్కొంది.  జయ ఆస్తులపై పర్యవేక్షణాధికారం వారిద్దరికీ ఉంటుందని తెలిపింది. పోయెస్‌ గార్డెన్‌లోనిఇంటిని జయ స్మారక మందిరంగా మార్చాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సింది ప్రభుత్వాన్ని కోర్టు సూచించింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే హర్షం వ్యక్తంచేసిన దీప, దీపక్‌ ఇద్దరూ కలిసి చెన్నై మెరీనాబీచ్‌లోని జయ సమాధికి వెళ్లి అంజలి ఘటించారు.

గార్డెన్‌లోనే కాపురం: దీప

కోర్టు తీర్పులో సైతం గార్డెన్‌కు ప్రాధన్యత ఇవ్వడంతో జయ నివాసం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా దీప మీడియాతో మాట్లాడుతూ, చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయం తమ పూర్వీకుల ఆస్తి, ఆ భవనం తమకు సొంతమని కోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె అన్నారు. జయకు నేరుగా వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తిని కాజేయాలని ఎందరో చేసిన ప్రయత్నాలకు కోర్టు అడ్డుకట్టవేసింది. పోయెస్‌గార్డెన్‌ ఇంటిని జయ స్మారకమందిరంగా మార్చడాన్ని అంగీకరించం. ఇందుకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర చట్టంపై కోర్టులో అప్పీలు చేస్తాం. జయకు చెందిన ఆస్తులన్నీ మాకే సొంతం. వాటిని స్వాధీనం చేసుకునేందుకు న్యాయవాదులతో చర్చిస్తున్నాం. జయ ఆస్తులను ఆక్రమించిన వారికి నోటీసులు జారీచేస్తాం. చట్టపరమైన సమస్యలు పరిష్కారం కాగానే పోయెస్‌గార్డెన్‌లో నివసిస్తాం. 

జయ ఆస్తులను స్వాధీనం చేసుకుని కాపాడే బాధ్యత మాపై ఉంది. జయ పేరున మేమే ట్రస్టును ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు సేవచేస్తామని దీప చెప్పారు. దీపక్‌ మాట్లాడుతూ, పోయెస్‌గార్డెన్‌ ఇల్లు వారసత్వంగా మాకు సంక్రమించిన ఆస్తి, దాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని అంగీకరించే ప్రసక్తేలేదని అన్నారు. జయ స్మారకమందిరంగా ప్రభుత్వం మార్చదలచుకుంటే తాముగా ఇవ్వాలేగాని వారు ఏకపక్ష నిర్ణయం తీసుకునేందుకు వీలులేదు. వేద నిలయంను సీఎం క్యాంపాఫీస్‌ చేయా లన్న సూచన కూడా సరికాదు. డీఎంకే అధి కారంలోకి వచ్చి స్టాలిన్‌ ముఖ్యమంత్రి అయిన పక్షంలో అందులో ఉంటారా. మాకు సాయుధ పోలీస్‌ బందోబస్తు కావాలని కోరలేదు. ఒక ఆస్తి కోసం నన్ను హత్యచేస్తే అందుకు బాధ్యులెవరు. ఎడపాడి, పన్నీర్‌సెల్వం తమ పూర్వీకుల ఆస్తిని జయ స్మారకమందిరంగా చేసుకుంటే మంచిదని దీపక్‌ వ్యాఖ్యానించారు.(స్మారక మందిరంగా జయలలిత నివాసం)

చిన్నమ్మకు చిక్కే..
జయ ఆస్తులపై కోర్టు ఇచ్చిన తీర్పు శశికళను చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. జయలలిత, శశికళ సంయుక్తంగా అనేక సంస్థలు నడుపుతుండేవారు. వాటిల్లోని జయ వాటాను దీప, దీపక్‌లకు కేటాయించాల్సి ఉంటుంది. లేదా జయ ఆస్తులన్నీ ట్రస్ట్‌ కిందకు తీసుకొస్తే మారుమాట్లాడకుండా శశికళ అప్పగించాల్సి రావచ్చు. కొడనాడు ఎస్టేట్, హైదరాబాద్‌లోని ద్రాక్ష తోట వివాదాలు కుదుటపడవచ్చు. 

ప్రభుత్వానికే అధికారం: సీవీ షణ్ముగం
చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసాన్ని స్మారక మందిరంగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు తీర్పుతో స్పష్టమైందని న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యానించారు. జయ ఇంటిని స్మారకమందిరంగా మార్చడంపై పునరాలోచించాలని, ఒక భాగం స్మారక మందిరం, మరో భాగం సీఎం క్యాంప్‌ ఆఫీస్‌గా మార్చవచ్చని కోర్టు సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కోర్టు తీర్పు ప్రతులు అందిన తరువాత క్షుణ్ణంగా అధ్యయనం చేసి బదులు పిటిషన్‌ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా