తబ్లిగి జమాత్‌ సభ్యుల విడుదల చేయాలి..

6 May, 2020 20:00 IST|Sakshi

ఢిల్లీ పోలీసుల కస్టడీకి తరలింపు

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో క్వారంటైన్‌ గడువును పూర్తిచేసిన 4000 మంది తబ్లిగి జమాత్‌ సభ్యులను విడుదల చేయాలని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. క్వారంటైన్‌ ముగిసిన తబ్లిగి సభ్యులను క్వారంటైన్‌ కేంద్రాల నుంచి విడుదల చేయాలని, మర్కజ్‌ ఘటనలో ప్రమేయం కలిగి విచారణను ఎదుర్కోవాల్సిన వారిని ఢిల్లీ పోలీసుల కస్టడీకి తరలించాలని ఢిల్లీ హోంమంత్రి సత్యేందర్‌ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మర్కజ్‌ ఘటనతో సంబంధం లేని ఇతరులందరినీ వారి స్వరాష్ట్రాలకు పంపించాలని, ఈ ఏర్పాట్ల నిమిత్తం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల రెసిడెంట్‌ కమిషనర్లతో సంప్రదింపులు జరపాలని హోం శాఖను కోరామని మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశ రాజధానిలో 4000 మంది తబ్లిగి సభ్యులు క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నారు. వీరిలో 900 మంది ఢిల్లీ వాసులు కాగా మిగిలిన వారిలో అత్యధికులు తమిళనాడు, తెలంగాణకు చెందిన వారని అధికారులు తెలిపారు. వీరిని స్వస్ధలాలకు పంపేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఢిల్లీ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. వేలాది మంది తబ్లిగి జమాత్‌ సభ్యులు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్‌కు హాజరైన అనంతరం పలువురు సభ్యులకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ ప్రాంతం కరోనా హాట్‌స్పాట్‌గా మారిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరు ఆరోగ్య కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది.

చదవండి : బాయ్స్‌ లాకర్‌ రూం: షాకింగ్‌గా ఉంది..

మరిన్ని వార్తలు