చిదంబరం కస్టడీ అవసరమే

21 Aug, 2019 03:01 IST|Sakshi
మంగళవారం ఢిల్లీలో చిదంబరం నివాసంలో సోదాలు చేసేందుకు వచ్చిన ఈడీ అధికారులు

ఐఎన్‌ఎక్స్‌ కేసులో ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్య

ముందస్తు బెయిలు ఇచ్చేందుకు నిరాకరణ

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తోందనీ, ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి అవినీతి, నగదు అక్రమ చలామణి కేసుల్లో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో చిదంబరంను అరెస్టు చేసేందుకు సీబీఐ, ఈడీలకు మార్గం సుగమమైంది. మంగళవారం రాత్రే సీబీఐ, ఈడీ అధికారుల బృందాలు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి చేరుకోగా, ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని సమాచారం. 3రోజుల్లో తాము సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నాననీ, అంతవరకు తనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలని చిదంబరం కోరినా హైకోర్టు ఒప్పుకోలేదు. దీంతో ముందస్తు బెయిలు కోసం సుప్రీంకోర్టులో బుధవారమే అత్యవసర విచారణ కోరాలని చిదంబరం లాయర్లు నిర్ణయించారు.

విచారణను నీరుగార్చలేం..
అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ చిదంబరం ఢిల్లీ హైకోర్టులో గతంలో పిటిషన్‌ వేశారు. గురువారం పదవీ విరమణ పొందనున్న న్యాయమూర్తి జస్టిస్‌ సునీల్‌ గౌర్‌ చిదంబరం అభ్యర్థనను తోసిపుచ్చారు. చిదంబరమే ప్రధాన నిందితుడనీ ప్రాథమికంగా తెలుస్తున్నందున, న్యాయపరమైన అడ్డంకులను సృష్టించి దర్యాప్తు సంస్థలను విచారణను నీరుగార్చలేమని ఆయన అన్నారు. హైకోర్టులో ఎలాంటి ఉపశమనమూ లభించకపోవడంతో చిదంబరం ఆ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ఆయనకు తక్షణ ఉపశమనమేదీ లభించనప్పటికీ, ఆయన పిటిషన్‌ బుధవారం విచారణకు రానుంది.

చిదంబరం ఇంటికి సీబీఐ, ఈడీ
చిదంబరానికి ముందస్తు బెయిలును నిరాకరిస్తూ సాయంత్రం 3.40 గంటల సమయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడంతో రాత్రికే సీబీఐ, ఈడీ అధికారులు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి చేరుకున్నారు. మొదట సీబీఐ, ఆ తర్వాత కొద్దిసేపటికే ఈడీ అధికారులు వెళ్లారు. అయితే అధికారులు ఎవ్వరూ మీడియాతో మాట్లాడలేదు. చిదంబరం ఇంటికి రావడం వెనుక ఉన్న ఉద్దేశమేంటని ప్రశ్నించినా వారు నోరు మెదపలేదు. అధికారులు వెళ్లిన సమయంలో చిదంబరం ఇంట్లో లేరని సమాచారం.

‘ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తోంది. ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని మేం భావిస్తున్నాం. చిదంబరం పార్లమెంటు సభ్యుడు అయినంత మాత్రాన ఆయనకు ముందస్తు బెయిలు ఇవ్వలేం. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చిదంబరంపై ఈ కేసులు పెట్టారని ఇప్పుడే చెప్పడం అర్థం లేని పని.’
– ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ సునీల్‌ గౌర్‌

‘మరో రెండ్రోజుల్లో పదవీ విరమణ పొందనున్న న్యాయమూర్తి జస్టిస్‌ సునీల్‌ గౌర్‌ హడావుడిగా సాయంత్రం 3.40 గంటలకు ఈ తీర్పు చెప్పారు. ఈ తీర్పును ఈ ఏడాది జనవరిలోనే రిజర్వ్‌లో ఉంచారు. మరో మూడు రోజులు ఆగి తీర్పును వెలువరించాలని కోరాం. అయినా జస్టిస్‌ గౌర్‌ మా విజ్ఞప్తిని పట్టించుకోకుండా మంగళవారమే తీర్పు ఇచ్చారు.’
 – కపిల్‌ సిబల్, చిదంబరం తరఫు న్యాయవాది  

ఐఎన్‌ఎక్స్‌ కేసు ఇదీ..
2007– ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు అందుకోవడానికి ఆమోదం తెలిపిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ). ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం. ఎఫ్‌ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని ఆరోపణలు.

► 2017 మే 15: ఐఎన్‌ఎక్స్‌ మీడియా వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ.  

► 2018 : ఐఎన్‌ఎక్స్‌ మీడియాపై మనీలాండరింగ్‌ కేసు పెట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).

► 2018 మే 30 : సీబీఐ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన చిదంబరం.  

► 2018 జూలై 23:ఈడీ కేసులోనూ ముందస్తు బెయిలు ఇవ్వాలని మరోసారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేసిన చిదంబరం.

► 2018 జూలై 25 : ఈ రెండు కేసుల్లోనూ  అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ తొలిసారి ఉత్తర్వులిచ్చిన ఢిల్లీ హైకోర్టు. ఆ తర్వాత పలుమార్లు ఆ గడువు పొడిగింపు.  

► 2019 జనవరి 25: ముందస్తు బెయిలుపై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఢిల్లీ హైకోర్టు.

► 2019 ఆగస్టు 20 : తీర్పు చెబుతూ, చిదంబరం బెయిలు అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.

మరిన్ని వార్తలు