ప్లాస్మా థెరఫీతో కోలుకున్న జైన్‌

21 Jul, 2020 13:38 IST|Sakshi

ప్రభుత్వ ఆస్పత్రులపై మంత్రి ప్రశంసలు

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో దాదాపు 30 రోజులు పోరాడిన  తర్వాత విధుల్లో చేరిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ దేశ రాజధానిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వైరస్‌కు మెరుగైన చికిత్స అందుబాటులో ఉందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లాస్మా థెరఫీ చికిత్సకు ఇచ్చిన అనుమతి గడువుతీరడంతో తాను ప్రైవేట్‌ ఆస్పత్రికి మారాల్సివచ్చిందని ఆయన వెల్లడించారు. తనను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించేందుకు ఒకరోజు ముందు తాను మామగారిని కోల్పోవడంతో తమ కుటుంబం భయాందోళనకు గురైందని చెప్పారు. తొలుత తాను చేరిన రాజీవ్‌గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏ ప్రైవేట్‌ ఆస్పత్రి కంటే మెరుగైదని స్పష్టం చేశారు. అయితే తన ఆరోగ్య  పరిస్థితి క్షీణించడంతో వైద్యులు తనకు ప్లాస్మా థెరఫీ ఇవ్వాలని నిర్ణయించారని, అందుకు ఆ ఆస్పత్రికి అనుమతి లేదని, ఎన్‌జేపీ అనుమతి కూడా గడువుతీరడంతో అనుమతి కోసం వేచిచూడాలని తాను భావించానన్నారు.

కుటుంబ సభ్యులు, వైద్యుల ఒత్తిడితో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాల్సివచ్చిందని చెప్పుకొచ్చారు. పదిరోజుల తర్వాత ఆ ఆస్పత్రులకు ప్లాస్మా థెరఫీ అందించేందుకు అనుమతి లభించిందని తెలిపారు. నాలుగు రోజుల కిందటి వరకూ తాను ప్రతిరోజూ ఆక్సిజన్‌ తీసుకున్నానని..కొద్దిరోజుల పాటు ఆక్సిజన్‌ లేకుండా ఉండగలగడంతో విధులు నిర్వహించేందుకు తనను వైద్యులు అనుమతించారని మంత్రి జైన్‌ తెలిపారు. కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను జూన్‌ 17న రాజీవ్‌ గాంధీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాకేత్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించి ఆక్సిజన్‌ను అందించారు. ప్లాస్మా థెరఫీ నిర్వహించిన అనంతరం మంత్రి జైన్‌ ఆరోగ్యం మెరుగుపడింది. చదవండి : తిరిగి విధుల్లో చేరిన ఢిల్లీ ఆరోగ్య‌మంత్రి

మరిన్ని వార్తలు