శబరిమలలో భక్తుల రద్దీ

18 Nov, 2019 03:52 IST|Sakshi
స్వామియే శరణం అయ్యప్ప.. ఉచ్ఛారణల నడుమ భారీగా శబరిమలకు చేరుకున్న భక్తులు

శబరిమల: మండల మకర విళక్కు పూజల కోసం ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు శబరిమల ఆలయానికి తరలివచ్చారు. వార్షిక మకర విళక్కు పూజల కోసం అయ్యప్ప దేవాలయాన్ని శనివారం తెరచిన విషయం తెలిసిందే. ఆదివారం  తెల్లవారు జామున 3 గంటలకు గర్భగుడిని దేవాలయ ముఖ్య పూజారి ఏకే సుధీర్‌ నంబూద్రి తెరచి, నెయ్యాభిషేకం, మహా గణపతి హోమం సహా పలు ప్రత్యేక పూజలు జరిపారు. కేరళ దేవాదాయ మంత్రి కే సురేంద్రన్‌ ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు వాసు, బోర్డు సభ్యులు, దేవాదాయ కమిషనర్‌ ఎం హర్షన్‌ తదితరులు ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. వార్షిక మండల పూజల నిమిత్తం వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఆదివారం భక్తులు శబరిమలకు పోటెత్తారు.   ఆలయ పరిసరాల్లో, గుడికి వెళ్లే మార్గాల్లో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. 10 మంది డీఎస్పీలు, 30 మంది ఇన్‌స్పెక్టర్లు, 120 మంది ఎస్సై/ఏఎస్సైలు, 1400 మంది కాన్‌స్టేబుళ్లను భక్తుల భద్రత కోసం సన్నిధానం వద్ద విధుల్లో ఉంచారు.

2018 తీర్పుపై స్టే ఉన్నట్లే!
మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే అమల్లో ఉన్నట్లే భావించాలని కేరళ న్యాయ శాఖ మంత్రి ఏకే బాలన్‌ ఆదివారం వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పునకు అనుగుణంగానే తమ ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. ‘రాజ్యాంగబద్ధ ప్రభుత్వంగా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం. కానీ ఇక్కడో సమస్య ఉంది. 2018లో ఇచ్చిన తీర్పుపై తాజాగా ఈ నవంబర్‌ 14న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్టే ఇచ్చారా? లేదా? అన్నది కీలక ప్రశ్న. స్టే ఇస్తున్నట్లు తీర్పులో ప్రకటించలేదు. కానీ వాస్తవానికి స్టే ఇచ్చినట్లే భావించాల్సి ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ప్రచారం కోసం ఆలయానికి రావాలనుకునే మహిళలను  ప్రోత్సహించబోమని కేరళ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

మరిన్ని వార్తలు