‘కర్నాటకం’ : డీకే వ్యూహం ఫలించేనా..?

7 Jul, 2019 14:14 IST|Sakshi

బెంగళూర్‌ : 12 మంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కర్ణాటకలోని పాలక కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌ సంక్షోభంలో పడింది. సంకీర్ణ సర్కార్‌ను సమస్యల నుంచి బయటపడవేసేందుకు కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ మరోసారి తనదైన వ్యూహాలకు పదునుపెట్టారు. జేడీఎస్‌ చీఫ్‌ హెచ్‌డీ దేవెగౌడతో ఆదివారం ఉదయం డీకే విస్తృతంగా సంప్రదింపులు జరిపారు. ఎమ్మెల్యేల రాజీనామా, ప్రభుత్వం చిక్కుల్లో పడిన వ్యవహారంపై ఆయనతో​చర్చించారు.

మరోవైపు రాజీనామా చేసిన పార్టీ ఎమ్మెల్యేలు ముంబైలోని సోఫిటెల్‌ హోటల్‌లో బస చేసినట్టు తెలియడంతో వారితో చర్చలు జరిపి తిరిగి సంకీర్ణ గూటికి చేరేలా నచ్చచెప్పేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ రచిస్తున్న వ్యూహాలకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక పార్టీ ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహిస్తూ జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ను కూల్చేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.

మరిన్ని వార్తలు