మందుల మాఫియా బేరసారాలు

12 Sep, 2016 20:05 IST|Sakshi

గల్ఫ్ దేశాల్లో నిషేధించబడిన నొప్పి నివారణ, నిద్ర మాత్రలను యథేచ్ఛగా రవాణా చేస్తున్న మాఫియా ముఠా తమ గుట్టు రట్టుకాకుండా ఉండటానికి ఎత్తులు వేస్తోంది. దుబాయ్‌లో 10 రోజుల కింద నిషేధిత మందులతో పట్టుబడిన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడపాకల్ వాసి పూసల శ్రీనివాస్ కుటుంబంతో రాజీకోసం ఈ ముఠా సభ్యులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. శ్రీనివాస్‌కు దుబాయ్‌కు వెళ్లడానికి ముందు మందుల పార్శిల్‌ను ఇచ్చిన వ్యక్తులపై కేసు పెట్టకుండా ఉండటానికి భారీ మొత్తంలో పరిహారం ఇవ్వడానికి ఈ ముఠా సభ్యులు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే బాధితుడి భార్య లతిక, ఇతర కుటుంబ సభ్యులు గల్ఫ్ రిటర్నింగ్ మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీ (జీఆర్‌ఎండబ్ల్యూఎస్) స్వచ్ఛంద సంస్థ చైర్మన్ చాంద్‌పాషాతో కలిసి తెలంగాణ సచివాలయంలోని ఎన్‌ఆర్‌ఐ సెల్‌లో ఫిర్యాదు చేశారు.

గల్ఫ్‌లో నిషేధించబడిన మందుల విషయంపై శ్రీనివాస్‌కు ఎలాంటి అవగాహన లేదని, కేవలం సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అతను వారిచ్చిన మందుల పార్శిల్‌ను తీసుకువెళ్లి, పోలీసుల తనిఖీల్లో పట్టుబడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే గల్ఫ్‌లో నిషేధించబడిన మందులను రవాణా చేయిస్తున్న మాఫియా ముఠా సభ్యులు తక్కువ వ్యవధిలోనే రూ.లక్షలు గడిస్తున్నారు. ఇప్పటివరకు మందుల మాఫియా సూత్రధారులెవరూ అరెస్టు కాలేదు. కేవలం మందుల రవాణా నేరం అని తెలియని అమాయకులే పట్టుబడ్డారు. శ్రీనివాస్ ఉదంతంతో తెలంగాణ ప్రభుత్వం పరిధిలోని ఎన్‌ఆర్‌ఐ సెల్ స్పందించింది. మందుల రవాణాపై దష్టి సారించాలని సీబీసీఐడీని ఆదేశించడంతో కేసును అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.

అయితే సీబీసీఐడీ రంగంలోకి దిగితే మందుల మాఫియా సూత్రధారులు బట్టబయలు కావచ్చనే గుబులు మాఫియా ముఠాకు పట్టుకుంది. దీంతో వారు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలను మొదలు పెట్టారు. బాధిత కుటుంబంతో రాజీ చేసుకుంటే తమ బండారం బయటపడకుండా ఉంటుందని ముఠా సభ్యులు భావిస్తున్నారు. బాధిత కుటుంబానికి రూ. ఐదు లక్షల పరిహారం చెల్లించడంతోపాటు, జైల్లో ఉన్న శ్రీనివాస్‌ను విడిపించడం కూడా తమ బాధ్యత అని ముఠా సభ్యులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒకవేళ కేసు నమోదు అయితే మందుల మాఫియా గుట్టు రట్టు అవుతుందనే ఉద్దేశంతోనే ముఠా సభ్యులు రాజీ యత్నాలను తీవ్రం చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే మందుల పార్శిల్‌ను ఇచ్చిన ముఠా సభ్యులు, శ్రీనివాస్‌కు టిక్కెట్ ఇచ్చిన ట్రావెల్స్ యజమాని పరారీలో ఉన్నారు. చివరకు వారి సెల్‌ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం, అధికారులు స్పందించి మందుల మాఫియా గుట్టు రట్టు చేయాలని, మందుల ముఠా వలలో అమాయకులెవరూ చిక్కకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

 

మరిన్ని వార్తలు