మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ ?

18 Jan, 2019 18:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగనుంది. మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసేందుకు కసరత్తు సాగుతున్నట్టు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్‌ 3తో ముగియనుంది. ఎన్నికలను ఏయే తేదీల్లో ఎన్ని దశల్లో నిర్వహించాలనే అంశంపై ఈసీ తర్జనభర్జనలు సాగిస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. భద్రతా దళాల లభ్యత, వాతావరణ పరిస్థితులు సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈసీ ఎన్నికల తేదీలను ఖరారు చేయనుంది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తును పూర్తి చేసి మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటిస్తుందని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిషా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలనూ నిర్వహించవచ్చని ఈసీ వర్గాలు పేర్కొన్నారు. ఇక 2014లో మార్చి 5న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ ఏప్రిల్‌-మే నెలల్లో తొమ్మిది విడతలుగా పోలింగ్‌ నిర్వహించింది. ఏప్రిల్‌ 7న తొలివిడత పోలింగ్‌ చేపట్టిన ఈసీ మే 12న తుది విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియను ముగించింది.

మరిన్ని వార్తలు