జీడీపీనా? ఉద్యోగాలా?

3 Jul, 2019 04:23 IST|Sakshi

వృద్ధి కంటే ఉద్యోగాల కల్పనే ముఖ్యమంటున్న 31% మంది

ఎకనామిక్స్‌ టైమ్స్‌ ముందస్తు బడ్జెట్‌ సర్వే

ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని ఐదేళ్లలో ఐదు ట్రిలియన్లకు చేర్చాలనేది ప్రధాని మోదీ కల. కానీ ఈ కల సాకారానికి ఎన్నో సవాళ్లు. ఇంకెన్నో సమస్యలు. కనుచూపు మేరలో పరిష్కారం కానరావడమే లేదు. ఆర్థిక వ్యవస్థ 20 త్రైమాసికాల కనిష్టానికి దిగజారింది. పెట్టుబడులు మందగించాయి. ఎకానమీలో కీలక సూచికలేవీ విశ్వాసం రేకెత్తించడం లేదు. ఉద్యోగాలు దొరకడం లేదు. వ్యవసాయ సంక్షోభం ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. కానీ అత్యధిక భారతీయులకు ఇవి ప్రాధాన్యతాంశాలుగా కన్పించడం లేదని, రుణమాఫీ గురించి సానుభూతితో యోచించే పరిస్థితి లేదని ఎకనామిక్స్‌ టైమ్స్‌ ముందస్తు బడ్జెట్‌ సర్వే తేల్చింది.  

సర్వేలో పాల్గొన్న వారిలో 35.4 శాతం మంది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, వృద్ధిరేటు పెంచడమే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు. 31.5 శాతం మంది వృద్ధి కంటే ఉద్యోగాల కల్పనకే పెద్దపీట వేయాలన్నారు. 19.7 శాతం మంది ఆదాయం పన్ను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న వారు కేవలం 13.4 శాతం మంది మాత్రమే.  

మద్దతు ధర పెంచాల్సిందే..
కనీస మద్దతు ధర పెంచడమే వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారమంటున్నారు 42.8 శాతం మంది. 29 శాతం మంది ఎకరానికి నిర్ణీత మొత్తం చొప్పున చెల్లింపులు జరపడం ఉత్తమమని భావిస్తున్నారు. రుణ మాఫీ వైపు మొగ్గు చూపుతున్న వారు 6.5 శాతం మంది మాత్రమే. 21.7 శాతం మంది ఉచిత విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించడంపై ఆర్థికమంత్రి దృష్టి పెట్టాలంటున్నారు.

పన్నులు ఎలా?
38 శాతం మందికిపైగా ప్రజలు ఆదాయం పన్ను బేసిక్‌ స్లాబ్‌ను ఐదు లక్షలకు పెంచాలని కోరుతున్నారు. 80(సీ) కింద పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలంటున్న వారు 19.9 శాతం మంది. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఏదో ఒక రూపంలో రివార్డులు ఇవ్వాలనే ఆలోచనను 33 శాతం మంది సమర్థిస్తున్నారు. మిగిలిన వారు ప్రస్తుత పన్ను శ్లాబులు బాగున్నాయని, మార్పులు చేయాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు.  

సంస్కరణలు అవసరమా?
ప్రత్యక్ష పన్నుల విధానంలో మార్పులు చేయాలని 34 శాతం మంది కోరుతున్నారు. తక్షణమే ఈ మార్పులు అవసరమంటున్నారు. 25.7 శాతం మంది భూ సేకరణ చట్టంలో మార్పులు అవసరమని భావిస్తుండగా, 24.7శాతం మంది కార్మిక చట్టాలను సంస్కరించాలంటున్నారు. విద్యుత్‌ రంగ సంస్కరణల వైపు మొగ్గు చూపిన వారు 15.6శాతం మంది మాత్రమే.  

ఉద్యోగాలు ఎలా?
ఉపాధి సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలి? ఈ ప్రశ్నకు విద్యా వ్యవస్థను ప్రక్షాళించడమే మార్గమని 40 శాతం మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు. 21.9 శాతం మంది కార్మిక సంస్కరణలతో సమస్యను పరిష్కరించవచ్చునన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం (27.5 శాతం మంది) ‘ముద్ర’తరహా పథకాలు మరిన్ని అమలు చేయడం (10.6 శాతం) ద్వారా ఉద్యోగాలు కల్పించవచ్చునన్నారు కొందరు.

కేటాయింపులు ఎలా?
బడ్జెట్‌ కేటాయింపుల్లో మౌలిక సదుపాయాల రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని 36.4 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రంగ కేటాయింపులకు పెద్ద పీట వేయాలంటున్నారు 29 శాతం మంది. మిగిలిన వారు నైపుణ్యాలు (18.7శాతం) పర్యావరణం (15.9శాతం) వైపు మొగ్గు చూపుతున్నారు. షేర్ల లాభాలపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్నును రద్దు చేయడం ద్వారా మదుపర్లను ఆకట్టుకోవచ్చునని 27.4 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అంకుర పరిశ్రమలకు విధించే ఏంజెల్‌ ట్యాక్స్‌ను రద్దు చేయాలంటున్నారు 30 శాతం మంది.

మరిన్ని వార్తలు