ఈ ఏడాది వృద్ధి 6.2%: ఈ అండ్ వై

6 Jun, 2014 01:38 IST|Sakshi
ఈ ఏడాది వృద్ధి 6.2%: ఈ అండ్ వై

 న్యూఢిల్లీ:  భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) 6.2% ఉంటుందని ట్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈ అండ్ వై) తాజాగా అంచనావేసింది. రానున్న మూడేళ్లలో వృద్ధి 8 శాతాన్ని అందుకోగలదని కూడా పేర్కొంది. మారుతున్న దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ఇందుకు దోహదపడతాయని విశ్లేషించింది. 2013-14లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 4.7%.  వరుసగా రెండవ యేడాది 5% దిగువన జీడీపీ కొనసాగింది.
 
 రూ. 4 లక్షలకు ఐటీ పరిమితి పెంచాలి...
 కాగా వృద్ధికి ఊపునిచ్చే క్రమంలో భాగంగా ఆదాయపు పన్ను (ఐటీ) పరిమితిని రూ. 4 లక్షలకు పెంచాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి సంస్థ విజ్ఞప్తి చేసింది. అలాగే జూలైలో రానున్న బడ్జెట్‌లో చిన్న ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చడానికి అదనపు పన్ను ప్రయోజనాలను కల్పించాలని కోరుతున్నట్లు సంస్థ విధాన వ్యవహారాల ప్రధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. మూలధన వ్యయాలను పెంచి తద్వారా డిమాండ్‌కు ఊతం ఇవ్వాలని కోరారు.
 
 చిన్న పొదుపులకు ప్రోత్సాహం, జీఎస్‌టీ, ప్రత్యక్ష పన్నుల విభాగాల్లో సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రోత్సాహం, ప్రభుత్వ వ్యయాల్లో పునర్‌వ్యవస్థీకరణ కూడా అవసరమని సూచించారు.
 
 సీఎస్‌ఆర్‌పై భారీ వ్యయం: కొత్త కంపెనీల చట్టంలోని నిబంధనలు అమలులోకి వస్తే, భారత్ కార్పొరేట్ రంగం వార్షికంగా తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతల(సీఎస్‌ఆర్) కింద రూ.22,000 కోట్లు వెచ్చించాల్సి రావచ్చని ఈ అండ్ వై అంచనావేసింది. వార్షిక నికర లాభంలో 2 శాతం సీఎస్‌ఆర్ కార్యకలాపాలపై వెచ్చించాల్సిన పరిధిలో దేశంలో దాదాపు 16,500 కంపెనీలు ఉన్నట్లు పేర్కొంది

మరిన్ని వార్తలు