టీచర్ల కొంపముంచిన కక్కుర్తి | Sakshi
Sakshi News home page

టీచర్ల కొంపముంచిన కక్కుర్తి

Published Fri, Jun 6 2014 12:46 PM

Teachers suspended for fake medical bills

సమాజాన్ని ముందుండి నడిపించి, పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు పక్కదారి పట్టారు. వారి కక్కుర్తే వారి కొంప ముంచింది. విద్యాశాఖలో అవినీతిపరుల భరతం పడుతూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్ నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.10 వేల కోసం ఆశపడి తమ బంగారు భవిష్యత్‌ను ఉపాధ్యాయులు నాశనం చేసుకున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2010లో విద్యాశాఖలో ఒక మహిళా అధికారితో పాటు 29 మంది ఉపాధ్యాయులు వైద్యం పేరుతో దొంగబిల్లులు సృష్టించి ప్రజాధనాన్ని లూటీ చేసి ప్రభుత్వాన్ని వంచించారు. వారిని సస్పెండ్ చేయాలని డెరైక్టరేట్ నుంచి  ఆర్‌సీ నెం 5407/2-1/2010 ప్రకారం  స్పష్టమైన ఆదేశాలు డీఈఓ కార్యాలయానికి అందాయి.  2009 నుంచి 2011 మధ్యకాలంలో ఈ దొంగబిల్లుల కథ తెలంగాణతో పాటు అనేక జిల్లాల్లో నడిచింది.  
 
జిల్లాలో వెలుగు చూసిన అక్రమాలెన్నో:
విజిలెన్స్ కమిటీ విచారణతో  జిల్లా విద్యాశాఖలో ఎన్నో అవకతవకలు బయటపడ్డాయి. ఈ కమిటీ నమ్మలేని నిజాలు తెలుసుకొంది. ఉత్తుత్తి  వైద్యం ఒక ఆస్పత్రిలో చేయించుకున్నట్టు ..బిల్లులు మరో ఆస్పత్రిపేరుతో ఉన్నట్టు తెలుసుకొంది. ఉదాహరణకు నగరంలోని ఒక డెంటల్ ఆస్పత్రికి అప్పట్లో మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు గుర్తింపు లేదు. కానీ ఇక్కడ వైద్యం చేయించుకుని, ఇదే వైద్యానికి తిరుపతిలో గుర్తింపు పొందిన హరిప్రియ ఆస్పత్రి పేరుతో బిల్లులు చూపించినట్లు తెలుసుకుని అవాక్కయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సిజేరియన్ ఆపరేషన్ కు రీయింబర్స్‌మెంట్ వర్తించదు. కానీ ఇదే పేరుతో కూడా బిల్లులు డ్రా చేసినట్టు తెలిసింది

దొంగబిల్లులతో డబ్బు దండుకున్న వారు వీరే:
ఎం. తులసి: అప్పట్లో ఓజిలి మండలంలో టీచర్. ఈమె రెఫరల్ ఆస్పత్రిగా బీఆర్‌ఎం పేరును రాశారు. వాస్తవానికి  కవిత ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈమె సీజేరియన్ ఆపరేషన్ చేయించుకున్నట్టు విజిలెన్స్ రిపోర్టులో ఉంది. సిజేరియన్ ఆపరేషన్‌కు నిబంధనల ప్రకారం రీయింబర్స్‌మెంట్ వర్తించదు. కాని ఈమె బిల్లులు  డ్రా చేసుకున్నారు.

ఎ. మంజుల: ఈమె నాయుడుపేటలోని జెడ్పీ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్. ఈమె రెఫరల్ ఆస్పత్రిగా హరిప్రియ (తిరుపతి) పేరు రాశారు. కానీ, నెల్లూరులోని ఒక డెంటల్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అప్పటికి ఈ ఆస్పత్రిలో చికిత్స జరిగితే  బిల్లులు రావు. అందుకే హరిప్రియ ఆస్పత్రి పేరుతో బిల్లులు డ్రా చేశారు.

సి. శశిధర్: ఈయన నాయుడుపేటలోని పుదూరు గ్రామంలో గణిత మాస్టారు. ఈయన కూడా నగరంలోని ఒక డెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొంది హరిప్రియ ఆస్పత్రి పేరుతో బిల్లులు పొందారు.

Advertisement
Advertisement